రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య
నరసరావుపేట: క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో ఈ ఏడాది ఆగస్టు 10న దేశ వ్యాప్తంగా నిర్వహించే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన రైతు, కార్మిక, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సమన్వయ సమితి సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో జరిగే ఆందోళనల్లో రైతులు, కార్మికులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాస్వామ్య వాదులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారన్నారు. కౌలు రైతులకు రుణాలు, పంటల కొనుగోళ్లు, ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయడం అత్యవసరమన్నారు. రాష్ట్రంలోని కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసి, బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వంకాయలపాటి శివ నాగరాణి మాట్లాడుతూ, గ్రామీణ పేదల జీవన పరిస్థితులు రోజురోజుకూ దయనీయంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు, కౌలు రైతు సంఘం నాయకులు వై.రాధాకృష్ణ, సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.రవిబాబులు మాట్లాడారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు జి.మల్లీశ్వరి, సీఐటీయూ నాయకుడు షేక్ సిలార్ మసూద్, రైతు కూలీ సంఘం నాయకుడు ఎన్.రాంబాబు, ఏఐటీయూసీ నాయకుడు రంగయ్య, నాగేశ్వరరావు పాల్గొన్నారు.


