భక్తిశ్రద్ధలతో వేదవ్యాసునికి ఆరాధన | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో వేదవ్యాసునికి ఆరాధన

Jul 29 2026 1:34 AM | Updated on Jul 29 2026 1:34 AM

భక్తిశ్రద్ధలతో వేదవ్యాసునికి ఆరాధన త్రికోటేశ్వరుని ఆదాయం రూ.12.02 లక్షలు

అమరావతి: ప్రముఖ వైష్ణవక్షేత్రమైన వైకుంఠపురంలోని భవఘ్ని ఆరామంలో ఉన్న శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రంలో నిర్వహిస్తున్న గురుపూర్ణిమ మహోత్సవాల రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం వేకువజామున వ్యాసభగవానునికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, వ్యాసారాధన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భవఘ్ని గురూజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆధునికత, నాగరికత పేరుతో మానవాళి చెడు మార్గంలో పడకుండా వ్యాసభగవానుడు అందించిన భగవద్గీత శాశ్వత మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. వ్యాసభగవానుడు ప్రసాదించిన వేదాలు, పురాణాలను భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా అలరించింది. అలాగే వ్యాసదేవులు ప్రసాదించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకున్న తర్వాత తమ జీవితాల్లో వచ్చిన మార్పులను భక్తులు అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సీతమ్మ వారికి సారె

మంగళగిరి టౌన్‌: పట్టణంలోని కొప్పురావు కాలనీ 9వ లైన్‌లో ఉన్న అభయ ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో మంగళవారం దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు సీతమ్మ వారికి సారె సమర్పించారు. స్థానికంగా ఉన్న మహిళలు మేళ తాళాలతో సీతారాముల వారి నామాలను, హనుమాన్‌ చాలీసాను పారాయణం చేసుకుంటూ ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి కుంకుమ, పసుపు, గాజులు, చీర, పూలు సమర్పించారు. విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో గురుపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం కమిటీ అధ్యక్షుడు రాము, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి చిన్న, కోశాధికారి రాజేంద్ర ప్రసాద్‌లతో పాటు సభ్యులు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.

నరసరావుపేట రూరల్‌: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి తొలి ఏకాదశి సందర్భంగా రూ.12.02 లక్షల ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో డి.చంద్రశేఖర రావు తెలిపారు. ఆలయ ఆవరణలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.11,62,024, అన్నదానం హుండీ ద్వారా రూ.40,342 కలిపి మొత్తం రూ.12,02,366 నగదు కానుకగా వచ్చింది. బంగారం 500 మిల్లీ గ్రాములు, వెండి 78 గ్రాములు, కొంత విదేశీ కరెన్సీ వచ్చినట్లు వివరించారు. దేవదాయ శాఖ అధికారి కె.మంజూష లెక్కింపును పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంక్‌ యల్లమంద శాఖ సిబ్బంది, ఆలయ సూపరిండెంటెంట్‌ చల్లా శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

భట్టిప్రోలులో గురుపౌర్ణమి వేడుకలు

భట్టిప్రోలు: భట్టిప్రోలు సాయిబాబా మందిరంలో సాయినాథ – దత్తాత్రేయ స్వామి వార్ల గురుపౌర్ణమి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, అష్టోత్తర పూజలు జరిగాయి. పూజా కార్యక్రమాలను వేద బ్రాహ్మణులు మురికిపూడి దుర్గాప్రసాద్‌ శర్మ నిర్వహించారు. సాయి నామ ప్రచార కార్యక్రమంలో భాగంగా భక్తులు పురవీధులలో భిక్షాటన నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు తమ్మన రమేష్‌బాబు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సాంబశివరావు, కోశాధికారి బి.కిరణ్‌కుమార్‌, కమిటీ సభ్యులు సీహెచ్‌ పాపారావు, బి. రమేష్‌బాబు, కె. రవి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement