పత్రాల కోసం పరుగులు | - | Sakshi
Sakshi News home page

పత్రాల కోసం పరుగులు

Jul 29 2026 1:34 AM | Updated on Jul 29 2026 1:34 AM

● జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి కొత్త నిబంధనలతో బ్రేక్‌ ● నెలల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రజల ప్రదక్షిణలు

వేటపాలెం: జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనల కారణంగా 2018 సంవత్సరానికి ముందు జనన, మరణ రిజిస్టర్‌లలో నమోదు చేసిన వివరాలకు వెంటనే ధ్రువీకరణ పత్రాలు జారీ కాకపోవడంతో ప్రజలు గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ కార్యాలయాలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (డీఎంహెచ్‌ఓ) కార్యాలయాల చుట్టూ వారాల తరబడి తిరుగుతున్నారు. అత్యవసర అవరాల కోసం ధ్రువీకరణ పత్రాలు కావాల్సిన వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఎలా ఉండేదంటే..

ఇప్పటి వరకు ఏదైనా జననం లేదా మరణం జరిగిన వెంటనే సంబంధిత గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ పరిధిలోని జనన, మరణ రిజిస్టర్‌లో నమోదు చేసేవారు. అనంతరం అవసరమైనప్పుడు దరఖాస్తు చేసుకుంటే సంబంధిత కార్యాలయం ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసేది. ఈ విధానం వల్ల ప్రజలకు పెద్దగా ఇబ్బందులు ఉండేవి కావు.

కొత్త నిబంధనలతో మారిన పరిస్థితి

ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త విధానం ప్రకారం 2018 సంత్సరానికి ముందు కేవలం మాన్యువల్‌ రిజిస్టర్‌లో నమోదై ఉండి, ఆన్‌లైన్‌లో నమోదు కాని వివరాలతో నేరుగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం నిలిచిపోయింది. ముందుగా డిజిటల్‌ విధానంలో నమోదు చేయాలని, అందుకోసం పలు అదనపు ధ్రువీకరణ పత్రాలు, ప్రత్యేక పత్రాలను సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత శాఖల అధికారులు చెబుతున్నారు. ఆ వివరాలను ఆన్‌లైన్‌ నమోదు చేసిన తర్వాత వాటిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పరిశీలించి ధ్రువీకరిస్తేనే తుది జనన లేదా మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయలేని పరిస్థితి నెలకొంది. అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత కూడా ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం పడుతోందని బాధితులు చెబుతున్నారు.

పెరుగుతున్న అసహనం..

ఒకప్పుడు ఒకటి లేదా రెండు రోజుల్లో లభించే ధ్రువీకరణ పత్రం కోసం ఇప్పుడు నెల రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త నిబంధనలపై సరైన అవగాహన లేకపోవడం, ప్రతి దశలో కొత్త పత్రాలు అడగడం, ఆన్‌లైన్‌ నమోదు ఆలస్యం కావడం వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై అసహం పెరుగుతోంది. సరళమైన విధానాన్ని అమలు చేయాలని, ఇప్పటికే ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన వివరాల ఆధారంగానే త్వరితగతిన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement