పాఠశాలలో
సైకిల్ స్టాండ్ ధ్వంసం
బాపట్ల టౌన్: అధికారంలో ఉన్నామనే అహంతో రెవెన్యూ, పంచాయతీ, విద్యాశాఖాధికారుల అనుమతి లేకుండానే జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నిర్మించిన సైకిల్ స్టాండ్‌ను కూటమి నాయకులు ధ్వంసం చేసిన ఘటన మండలంలోని చెరువుజమ్ములపాలెంలో చోటుచేసుకుంది. సుదూర ప్రాంతాల
విద్యార్థులు, ద్విచక్ర వాహనాలపై వచ్చే ఉపాధ్యాయుల కోసం దీనిని నిర్మించారు. వాహనాలను పార్కింగ్ చేసేందుకు వీలుగా 2014–19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో సైకిల్‌స్టాండ్‌ను నిర్మితమైంది. ఆ గ్రామంలోని ఎన్‌ఆర్‌ఐలు స్వచ్ఛందంగా స్పందించి స్థానిక చిన్నారులకు 80 మంది వరకు సైకిళ్లు కూడా పంపిణీ చేశారు.
ఆదేశాలు బేఖాతర్
ప్రభుత్వ పాఠశాలల్లో మరే ఇతర భవనాలు నిర్మించరాదని గత ప్రభుత్వం 2023లో స్పష్టమైన ఆదేశాలు జారీచేయటంతోపాటు చట్టసభలో తీర్మానం చేసి జీవో ఇచ్చింది. అయినప్పటికీ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ అధికారుల అనుమతులు లేకుండానే మండలంలోని చెరువుజమ్ముపాలెంలో కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు పాఠశాలలోని సైకిల్‌స్టాండ్ కూల్చేశారు. కనీసం అధికారుల అనుమతులు కూడా తీసుకోలేదు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి అనుమతి లేని భవనాలు నిర్మించకుండా చూడాలని వారు కోరుతున్నారు.


