పాఠశాల నుంచి తప్పిపోయిన చిన్నారులు కారంచేడు: పాఠశాలకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు బయటకు వచ్చి కనిపించకుండా పోయారు. ఈ ఘటన మండలంలోని స్వర్ణ గ్రామంలో మంగళవారం జరిగింది. ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు వెతికినా తప్పిపోయిన చిన్నారులు కనిపించలేదు. దీంతో వారు కారంచేడు విద్యాశాఖ అఽధికారి గోపతోటి శ్యాంసన్‌కు విషయం తెలియజేశారు. ఆయన స్థానిక పోలీస్‌లకు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగారు. విచారణలో పిల్లలు మధ్యాహ్న భోజన విరామ సమయంలో బయటకు వెళ్లి గ్రామ పొలిమేరలో ఆటలాడుకుంటూ ఉండగా గుర్తించారు. పోలీస్‌లు వారిని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అప్పగించారు.
మణిపాల్‌లో అవయవదానం తాడేపల్లి రూరల్ : తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఈ మేరకు హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయరెడ్డి వివరాలు వెల్లడించారు. బాపట్ల జిల్లా అడవుల దీవి, నిజాంపట్నంకు చెందిన అవ్వారు లక్ష్మీ కనకదుర్గ (53) ఇంటివద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో మణిపాల్ ఆసుపత్రిలో ఈ నెల 26వ తేదీన చికిత్స నిమిత్తం చేర్పించారు. వైద్యం అందించినా ఆమె ఆరోగ్యపరిస్థితిలో మార్పు కనిపించలేదు. జూలై 27వ తేదీన వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. లక్ష్మీ కనకదుర్గ భర్త వెంకట చంద్రశేఖరరావు, కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఆంధ్రప్రదేశ్ జీవన్‌దాన్ చైర్మన్ కె. రాంబాబు ఆధ్వర్యంలో ఆమె అవయవాలను దానం చేశారు. కాలేయం, ఒక కిడ్నీని మణిపాల్ హాస్పిటల్‌లో అవసరమైన వారికి మార్పిడి చేయగా, మరొక కిడ్నీని వేదాంత హాస్పిటల్‌కు తరలించారు. అవయవదాన కార్యక్రమానికి ముందుకు వచ్చిన దాత కుటుంబానికి మణిపాల్ హాస్పిటల్ కృతజ్ఞతలు తెలియజేసింది.
నకిలీ చలాన్లపై చర్యలకు సిద్ధం
● గుంటూరు కార్పొరేషన్‌లో 8 మంది
ఉద్యోగులపై సీడీఎంఏకు లేఖ
రాసిన కమిషనర్
● రూ.68.65 లక్షల దుర్వినియోగం
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో నకిలీ యూడీఏ (అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) చలాన్లు, నకిలీ బ్యాంక్ స్టాంపింగ్ చలాన్ల వ్యవహారంపై చర్యలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. 2015 నుంచి 2017 వరకు నకిలీ బ్యాంక్ చలానాలు సృష్టించి రూ.68.65లక్షల అవినీతికి పాల్పడ్డారు. ఈ విషయం ఆడిట్ విభాగం కనిపెట్టి సదరు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరింది. సదరు అంశంపై ప్రభుత్వ ఆదేశాలతో జరిగిన విచారణ కమిటీ నివేదిక ఆధారంగా 8 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ సర్వీస్ వివరాలతో కూడిన లేఖను ఈ నెల 24వ తేదీన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్‌కు పంపిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్స్(ఎల్‌టీపీ) కారణంగా కార్పొరేషన్‌కు ఆర్థిక నష్టం జరిగినట్లు నివేదికలో తెలిపారు. మొత్తం చెల్లించాల్సిన మొత్తం రూ.74.79 లక్షలు కాగా, అందులో రూ.68.65 లక్షలు దుర్వినియోగమయ్యాయి. ఇప్పటివరకు రూ.34.20 లక్షలు రికవరీ చేయగా, ఇంకా రూ.34.45 లక్షలు రికవరీ చేయాల్సి ఉందన్నారు.