గుంటూరు లీగల్: నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఐదవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) లత సూచించారు. గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సాయి కల్యాణ్ చక్రవర్తి ఆదేశాల మేరకు విద్యార్థుల్లో న్యాయ అవగాహన పెంపొందించే లక్ష్యంతో మంగళవారం గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ‘న్యాయ విజ్ఞాన సదస్సు’ నిర్వహించారు. కార్యక్రమానికి ఐదవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) లత ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు న్యాయ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు. న్యాయమూర్తి లత మాట్లాడుతూ సోషల్ మీడియా, ఇంటర్‌నెట్ వంటి డిజిటల్ వేదికలను బాధ్యతాయుతంగా వినియోగించడంతోపాటు వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంచుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనుమానాస్పద లింకులు, నకిలీ వెబ్‌సైట్లు, ఆనన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు తమ కుటుంబాలకు ఎంతో విలువైన వారని, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ తమ భద్రతను కాపాడుకోవాలని అన్నారు. జీవితంలో ధైర్యంగా ముందుకు సాగుతూ, సురక్షితమైన వాతావరణంలో ఉంటూ, తమను తాము రక్షించుకునే అవగాహనను పెంపొందించుకోవాలని తెలిపారు. నేరాలకు అవకాశమిచ్చే పరిస్థితులను నివారిస్తూ, సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోక్సో చట్టం–2012 గురించి వివరిస్తూ 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను లైంగిక వేధింపులు, దుర్వినియోగం నుంచి రక్షించేందుకు ఈ చట్టం అమలులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. న్యాయ విజ్ఞాన సదస్సులో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఐదవ అదనపు సివిల్ జడ్జి లత


