హోటల్‌లో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

హోటల్‌లో అగ్నిప్రమాదం

Jul 28 2026 1:54 AM | Updated on Jul 28 2026 1:54 AM

హోటల్‌లో అగ్నిప్రమాదం వైఎస్సార్‌ విగ్రహం ప్లాట్‌ఫాంను ఢీకొన్న ఘటనపై విచారణ విద్యుత్‌షాక్‌తో కేబుల్‌ ఆపరేటర్‌ మృతి ఉర్దూ భాషాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధికి తీర్మానం పేకాట స్థావరంపై పోలీసుల దాడి

రేపల్లె: పట్టణ శివారులోని ఓ హోటల్‌లో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇన్‌చార్జి ఫైర్‌ ఆఫీసర్‌ పి.శ్రీనివాస్‌ వివరాల మేరకు పెనుమూడి రోడ్డులోని దేవగిరి రమేష్‌బాబుకు చెందిన పల్లె రుచులు హోటల్‌లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. హోటల్‌లోని తాటాకు పందిళ్లకు మంటలు వ్యాప్తి చెందాయి. నిర్వాహకుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారని పేర్కొన్నారు.

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): గుంటూరు నగరంలో స్తంభాలగరువు సెంటర్‌లో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహం ప్లాట్‌ఫాం వెనుక భాగాన్ని గుర్తు తెలియని వ్యక్తి ఢీ కొట్టడంతో మూడు రాతి దిమ్మెలు ఊడి పడిన ఘటన పై విచారణ నిర్వహించడం జరిగిందని వెస్ట్‌ డిఎస్పీ బెల్లం శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. ఒక గుర్తు తెలియని ట్రాక్టర్‌ మలుపు తిరిగే సమయంలో వాహనం అదుపు తప్పి వైఎస్‌ఆర్‌ విగ్రహ వేదిక ప్లాట్‌ఫాం వెనుక భాగాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో విగ్రహం చుట్టూ ఉండే ప్లాట్‌ఫాం వెనుక భాగంలో మూడు రాతి దిమ్మెలు ఊడి కిందపడి పోయాయి. దీన్ని గమనించిన స్థానికులు ట్రాక్టర్‌ డ్రైవర్‌ను పట్టుకునేందుకు యత్నించగా వాహనాన్ని నిలపకుండా పరారై పోయాడు. సమాచారం తెలుసుకున్న పట్టాభిపురం పోలీసలు ఘటనా ప్రదేశంంలో ప్రమాదం జరిగిన వైనాన్ని విచారించారు. విచారణలో ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు, వేగంగా అదుపు తప్పి ఢీకొట్టిన ట్రాక్టర్‌ డ్రైవర్‌, ట్రాక్టర్‌ ను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ ఇన్‌చార్జి డిఎస్పీ పేర్కొన్నారు.

పట్నంబజారు(గుంటూరు ఈస్ట్‌): విద్యుత్‌ షాక్‌కు కేబుల్‌ ఆపరేటర్‌ మృతి చెందిన సంఘటనపై కేసు నమోదైంది. గుంటూరు లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏటీ అగ్రహారానికి చెందిన కావలి రామకృష్ణ (45) ఐపీడీ కాలనీ పరిసర ప్రాంతాల్లో కేబుల్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఐపీడీ కాలనీలో కేబుల్‌ వైర్ల మరమ్మతులు నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్‌ వైర్‌ రామకృష్ణపై పడింది. విద్యుత్‌ షాక్‌కు గురైన రామకృష్ణ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య అరుణకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్ర ఉర్దూ అకాడమీ సమావేశంలో పలు నిర్ణయాలు

మంగళగిరి టౌన్‌ : మంగళగిరి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ప్రధాన కార్యాలయంలో సోమవారం అకాడమీ 22వ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అకాడమీ చైర్మన్‌ ఫారుక్‌ షిబ్లీ అధ్యక్షతన పలు అజెండా అంశాలను బోర్డు సభ్యులు సమగ్రంగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉర్దూ భాషాభివృద్ధి, మైనార్టీ యువతకు నైపుణ్యాభివృద్ధి, కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాల బలోపేతం, ఉర్దూ గ్రంథాలయాల అభివృద్ధి, సేవా నియమాళి, కారుణ్య నియామకాలు, ఉర్దూ సాహిత్య ప్రచురణలు తదితర అంశాలపై తీర్మానం చేశారు. రాష్ట్రంలోని 36 కంప్యూటర్‌ ట్రైనింగ్‌ సెంటర్ల కోసం కంప్యూటర్ల కొనుగోలుకు ఏపీటీఎస్‌కు చెల్లించిన మొత్తం నిధులు విడుదలైనా వివిధ కారణాలతో సరఫరా ఆలస్యం కావడంపై బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. సరఫరా చేయని పరికరాలకు సంబంధించిన మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లించాల్సిందిగా ఏపీటీఎస్‌కు లేఖ రాయాలని, అవసరమైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 36 కంప్యూటర్‌ ట్రైనింగ్‌ సెంటర్లలో ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఏడీసీఏ, మల్టీ లాంగ్వేజ్‌ డీటీపీ కోర్సులను ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. సమావేశంలో బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్‌ సభ్యులు, మైనార్టీ వెల్ఫేర్‌ సెక్రటరి చిత్తూరి శ్రీధర్‌, ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ అడిషనల్‌ సెక్రటరి జంపాని శివయ్య, ఉర్దూ అకాడమీ వైస్‌ చైర్మన్‌ పఠాన్‌ ఖాదర్‌ ఖాన్‌, బోర్డు సభ్యులు మెహబూబ్‌ బాషా, అకాడమీ డైరెక్టర్‌ నిజాముద్దీన్‌ తదితరులు ఉన్నారు.

నకరికల్లు: నకరికల్లు శివారు ఎస్సీ కాలనీలో కొంతమంది వ్యక్తులు కోతముక్క పేకాట ఆడుతుండగా ఎస్‌ఐ కె.సతీష్‌, సిబ్బందితో దాడి చేసి నలుగురు వ్యక్తులను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి 3 మొబైల్‌ ఫోన్‌లు, రూ.5,770 నగదు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement