లక్ష్మీపురం(తిరువూరురూరల్): ఇబ్రహీంపట్నం–జగదల్‌పూర్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళగిరి నుంచి తిరువూరు వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో డ్రైవింగ్ చేస్తున్న కారుమంచి హరికృష్ణ ప్రసాద్(60)కి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న ఆయన భార్య భవానికి కూడా తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. తిరువూరు మండలం చింతలపాడుకు చెందిన హరికృష్ణ ప్రసాద్ మంగళగిరిలో నివసిస్తూ స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని విజయ బ్యాంక్ సెంటర్ సమీప హైవేపై శనివారం రాత్రి రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భూక్యా శ్రీసాయితోపాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు శ్రీసాయి తలకు బలమైన గాయమై చెవుల్లోంచి రక్తం కారడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అర్బన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ట్రాఫిక్ ప్రమాదానికి కారణమైన వాహనాల్ని తొలగించి ట్రాఫిక్‌ను నియంత్రించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


