యడ్లపాడు: క్షణకాలపు నిద్రమత్తు... జీవితాన్నే చీకట్లోకి నెట్టేసేంత పెనుప్రమాదమై ముంచుకొచ్చింది. కనురెప్పల వెనుక చేరిన అలసట, వేగంగా వెళ్తున్న వాహనాన్ని ఆపలేకపోయింది సరే... ఏకంగా వాహనం ధ్వంసం కావడంతో పాటు దానిని నడుపుతున్న డ్రైవర్‌ను కూడా తీవ్రగాయాల పాలు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యడ్లపాడు మండలం తిమ్మాపురం పరిధిలోని నూతన పెట్రోల్ బంకు సమీపంలో వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. 16వ నంబర్ జాతీయ రహదారి కొత్త బైపాస్‌పై గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో కారు కంటైనర్ వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. దానిని గమనించని కంటైనర్ డ్రైవర్ వాహనాన్ని కొద్దిదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి, టైర్లు వేడెక్కి అరిగిపోయాయి. స్థానికులు వెంటనే స్పందించి కంటైనర్‌ను నిలిపివేసి, కారులో చిక్కుకుపోయిన గుంటూరుకు చెందిన ఉప్పుటూరు హర్ష (33)ను ఎంతో శ్రమించి బయటకు తీశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హర్షను మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితుడు గుంటూరు నుంచి బాపట్ల జిల్లా మార్టూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, కారులో అతనొక్కడే ఉన్నాడని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న యడ్లపాడు పోలీసులు, హైవే సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ధ్వంసమైన వాహనాన్ని రహదారిపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
410 కిలోల గంజాయి స్వాధీనం
పిడుగురాళ్ల: మాదక ద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యలలో భాగంగా పట్టణ పోలీసులు 410 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్‌ఐ డి.శివనాగరాజు గురువారం తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈ నెల 21వ తేదీన విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో పిడుగురాళ్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. మాయాబజారు, మంగళబజారుకు చెందిన మారబోయిన అరుణ్‌సాయిని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయటంతో అతని వద్ద 410 గ్రాముల గంజాయి లభించిందన్నారు. అతనిని విచారించటంతో వినుకొండకు చెందిన లీలా అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు. అరుణ్‌సాయి కొనుగోలు చేసి తెచ్చిన గంజాయిలో కొంత భాగాన్ని వినియోగించి మిగిలిన భాగాన్ని చిన్ని చిన్న ప్యాకెట్లుగా ఏర్పాటు చేసి వాటిని విక్రయించేందుకు మార్కెట్ యార్డుకు తీసుకొని వచ్చినట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, ప్యాకింగ్ కవర్లను సీజ్ చేసినట్లు తెలిపారు.


