తుళ్లూరు మండలం
రాయపూడి వద్ద ఘటన
తాడికొండ: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను టిప్పర్ వెనుకనుంచి ఢీకొన్న ఘటనలో భార్య మృతిచెందగా.. భర్త గాయాలపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డమాను గ్రామానికి చెందిన భార్యాభర్తలు గురువారం ద్విచక్రవాహనంపై వెళుతుండగా తుళ్లూరు మండలం రాయపూడి వద్ద వెనుకనుంచి వచ్చిన టిప్పర్ వీరి బండిని ఢీకొట్టడమే కాకుండా.. కొంతమేరకు ఈడ్చుకువెళ్లింది. ఘటనలో భార్య డేగల వెంకాయమ్మ (37) అక్కడికక్కడే మృతిచెందింది. భర్తకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భూ సమీకరణ ప్రగతి సాధించాలి
గుంటూరు వెస్ట్: సీఆర్డీయే రెండో విడత భూ సమీకరణ వారం రోజుల్లో ప్రగతి సాధించాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశించారు. సీఆర్డీయే భూ సమీకరణపై గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసి హాల్లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సీఆర్డీయే అదనపు కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నోటిఫై చేసిన భూముల సమీకరణ ఆవశ్యమని అందుకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పెద్దపరిమి, హరిశ్చంద్రాపురం, వడ్డమాను గ్రామాల్లో అవగాహన త్వరగా చేపట్టాలన్నారు. భూసమీకరణకు డిప్యూట్ చేసిన సర్వేయర్‌లు వెంటనే చేరాలని ఆదేశించారు. రికార్డు ప్రకారం భూమి వివరాలు, భౌతికంగా ఉన్న భూమి వివరాలు సరిపోతే సమీకరణ చేయవచ్చన్నారు. రికార్డు ప్రకారం ఉన్న భూమి కంటే ఎక్కువ భూమిని ఎవరు క్లెయిమ్ చేయలేరని స్పష్టం చేశారు. డాక్యుమెంట్‌లో చూపిన భూమిని రైతు విధిగా చూపించాలని తెలిపారు. డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డీఓలు కె.శ్రీనివాస రావు, కె.శ్రీరమణి, సీఆర్డీయే డిప్యూటీ కలెక్టర్‌లు, సంబంధిత మండల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.


