మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు అమానుషం | - | Sakshi
Sakshi News home page

మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు అమానుషం

Jul 9 2026 6:41 AM | Updated on Jul 9 2026 6:41 AM

నరసరావుపేట: మహిళలు, బాలికలపై రోజురోజుకూ పెరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచార ఘటనలను అరికట్టాలని ఐద్వా రాష్ట్ర మాజీ కమిటీ సభ్యురాలు గద్దె ఉమాశ్రీ డిమాండ్‌ చేశారు. లైంగిక దాడులు ఆపాలని కోరుతూ మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో బుధవారం కోటప్పకొండరోడ్డులోని విజ్ఞాన కేంద్రం వద్ద మహిళలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి గుంటుపల్లి రజని అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఉమాశ్రీ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమెను నిర్బంధించి మత్తు పదార్థాలు ఇచ్చి పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడిన ఘటన అత్యంత అమానుషమన్నారు. అనంతరం నేర ఆనవాళ్లు లేకుండా ఉండేందుకు బాధితురాలిపై తీవ్ర హింసకు పాల్పడటం సమాజాన్ని కలిచివేసే విషయమన్నారు. రాష్ట్రాల్లో గంజాయి, మత్తు పదార్థాల మాఫియా విస్తరిస్తుందని, చాక్లెట్లు, సిగరెట్ల రూపంలో పిల్లలకు మత్తు పదార్థాలు అందుబాటులోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటికి బానిసలవుతున్న యువత విచక్షణ కోల్పోయి చిన్నారులనే లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. మహిళలు, బాలికల భద్రతపై ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకుని వేగవంతంగా శిక్షలు అమలు చేయాల్సి ఉండగా వారికి రాజకీయ పరిరక్షణ లభించడం దురదృష్టకరమని విమర్శించారు. సెల్‌ఫోన్లలో అశ్లీల వీడియోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని బెదిరిస్తూ మహిళలపై లైంగిక దాడులు ఎక్కువయ్యాయన్నారు. మహిళలు, బాలికల రక్షణకు కఠిన చట్టాల అమలుతో పాటు నిందితులకు తక్షణమే శిక్షలు పడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు వి.రాణిమాధవి, సీఐటీయూ నాయకురాలు డి.శివకుమారి, ఐద్వా నాయకురాళ్లు జె.అనూష, ఎస్‌.దుర్గాబాయి, సుజాత, పార్వతి పాల్గొన్నారు.

దాడులు నియంత్రించాలంటూ ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు నిరసన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement