రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సందర్శన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సందర్శన

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 4:52 AM

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సందర్శన 7న సెక్యూరిటీ గార్డుల రాష్ట్ర సదస్సు బగళాముఖి సేవలో గాయకుడు మనో

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని భారత వాతావరణ శాఖ చైన్నె రీజనల్‌ హెడ్‌ డాక్టర్‌ డి.శివానంద బుధవారం సందర్శించారు. స్టేట్‌ ఎమర్జన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ ఉపయోగించే అత్యాధునిక సాంకేతికతను పరిశీలించారు. అనంతరం వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తుల సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె. కౌసర్‌ బానో మాట్లాడుతూ తుఫాన్‌లు, భారీ వర్షాలు, పిడిగుపాటు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు భారత వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్జీజీఎస్‌ అవేర్‌ సంయుక్తంగా పనిచేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అమరావతి వాతావరణ కేంద్ర డైరెక్టర్‌ స్టెల్లా, ఎస్‌డీఎంఏ పరిపాలనా అధికారి కొడారి రవిబాబు, ఎస్‌ఈఓసీ ఇన్‌చార్జి పీటర్‌, ఐఎండీ శాస్త్రవేత్త సాగర్‌ పాల్గొన్నారు.

మంగళగిరి టౌన్‌: సెక్యూరిటీ గార్డుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7వ తేదీన రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముజఫర్‌ అహ్మద్‌ తెలిపారు. మంగళగిరి పట్టణం సీఐటీయూ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముజఫర్‌ మాట్లాడుతూ మంగళగిరి పట్టణ పరిధిలోని రత్నాల చెరువు వద్ద ఉన్న సింహాద్రి శివారెడ్డి భవనంలో సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు, యూనియన్‌ మంగళగిరి కార్యదర్శి బుచ్చిబాబు, నాయకులు సునీత, బాలాజీ పాల్గొన్నారు.

చందోలు(కర్లపాలెం): ప్రముఖ నేపథ్య గాయకుడు మనో దంపతులు బుధవారం చందోలు బగళాముఖి అమ్మ వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మనో దంపతులకు ఆలయ ఈవో నరసింహమూర్తి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. చందోలు ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన కె.మాధవరావు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. మడకసిర మాజీ ఎమ్మెల్సీ తిప్పె స్వామి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement