మార్చి నుంచి ప్రగతి కార్యక్రమాలకు ఆటంకం రెండేళ్లుగా విడుదల కాని స్టాంప్ డ్యూటీ బకాయిలు అవస్థలు పడుతున్న కార్యదర్శులు
రెండేళ్లుగా స్టాంప్ డ్యూటీ బకాయిలు..
వేటపాలెం: జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 25 మండలాల పరిధిలో 489 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రభుత్వం మార్చి నుంచి మూడు నెలలుగా గ్రామ పంచాయతీల సాధారణ నిధులు బ్యాంకు ఖాతాల నుంచి నగదు డ్రా చేసుకునే అవకాశాన్ని నిలిపివేడంతో అభివృద్ధి పనులు పూర్తిగా కుంటుపడ్డాయి. మరో వైపు పంచాయతీలకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ వాటా కూడా టీడీపీ ప్రభుత్వ అధికారం చేపట్టిన తరువాత విడదల కాకపోవడంతో స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఏడాదిలో మూడు నెలలకు ఒకసారి స్టాంప్ డ్యూటీ నిధులు పంచాయతీల ఖాతాలకు జమ చేసేవారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, చిన్నపాటి మరుమ్మతుల వంటి రోజువారీ అవసరాల కోసం వినియోగించే నిధులు అందుబాటులో లేకపోవడంతో కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యానికి వినియోగించే మెటీరియల్ కొనుగోలు, గ్రామాల నుంచి చెత్తను తరలించే ట్రాక్టర్లు డీజిల్, మరమ్మతులు, చెత్త సేకరణ వాహన ఖర్చులు, విద్యుత్ బిల్లులు చెల్లింపులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
పారిశుద్ధ్య నిర్వహణపై ప్రభావం...
నిధుల కొరత కారణంగా అనేక గ్రామాల్లో శానిటేషన్ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించలేక పోతున్నారు. బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్, ఇతర పారిశుద్ధ్య సామగ్రి కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేకపోవడంతో గ్రామాల్లో పరిశుభ్రత దెబ్బతింది. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వ్యాధుల నివారణ చర్యలు చేపట్టడం కూడా కష్టసాధ్యంగా మారిందని అధికారులు చెబుతున్నారు.
విద్యుత్ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం..
గ్రామాల్లో వీధి దీపాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు చెల్లించలేక పంచాయతీలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే కొన్ని పంచాయతీలకు బకాయిలు పెరిగిపోయాయని, ఇదే పరిస్థితి కొనసాగితే విద్యుత్ సరఫరాపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు.
పంచాయతీల ఆదాయ వనరుల్లో ప్రధానమైన స్టాంప్ డ్యూటీ వాటా టీడీపీ ప్రభుత్వ అధికారం చేపట్టిన నాటి నుంచి విడుదల కాకపోవడంతో మరో సమస్యగా మారింది. ఈ నిధులు అందితే గ్రామాల్లో మౌలిక వసతులు అభివృద్ధి, రహదారులు, కాలువలు, తాగునీటి సదుపాయాల మెరుగుదలకు ఉపయోగపడతాయని కార్యదర్శులు చెబుతున్నారు. అయితే బకాయిలు పేరుకుపోవడంతో అభివృద్ధి నిలిచిపోయింది.


