ఓటర్ల జాబితాపై విచారణ ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల జాబితాపై విచారణ ముఖ్యం

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 4:52 AM

ఓటర్ల జాబితాపై విచారణ ముఖ్యం

జిల్లా కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

చీరాల: ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీలో తప్పుగా నమోదైన వివరాలను క్షేత్రస్థాయిలో సరిచేయాలని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా ప్రక్రియపై చీరాల ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ పట్టణంలోని గంజిపాలెంలోని ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఆయన స్వయంగా విచారించారు. చీరాల నియోజకవర్గంలో 2,03,641 మంది ఓటర్లున్నారని చెప్పారు. వీరిలో 1,16,283 ఓట్లను మ్యాపింగ్‌ చేశామన్నారు. ఇప్పటి వరకు 57 శాతం ఓట్లు మ్యాపింగ్‌ జరగ్గా, 87,358 ఓట్లను మ్యాపింగ్‌ జరగకపోవడంపై కలెక్టర్‌ ఆరా తీశారు. 21,188 ఓట్లు తప్పుడుగాను, డబుల్‌ ఎంట్రీలుగాను, సవరణలు, చిరునామాలు స్పష్టత లేదన్నారు. మ్యాపింగ్‌ జరిగిన ఓట్లన్నింటినీ ప్రింట్‌ చేసి పంపిణీకి సిద్ధం చేయాలన్నారు.

లాగిన్‌ వివరాలపై అసహనం

ఓటర్ల జాబితా తయారీ, విచారణలో చీరాల, వేటపాలెం ఎంపీడీఓలకు, చీరాల మున్సిపల్‌ కమిషనర్‌కు లాగిన్‌ ఇచ్చిన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. చీరాల నియోజకవర్గంలో 218 పోలింగ్‌ కేంద్రాలున్నాయని, ఆ కేంద్రాల పరిధిలో 218 మంది బీఎల్‌ఓలు ఉన్నారన్నారు. వారి లాగిన్‌ నుంచి ఎప్పటికప్పుడు విచారణ ప్రక్రియ కొనసాగించాలన్నారు. చీరాల నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఆ రెండు మండలాల ఎంపీడీఓలకు, చీరాల మున్సిపల్‌ కమిషనర్‌కు లాగిన్‌ ఇచ్చామన్నారు. విచారణ చేయాల్సి ఉండగా నేటికీ ఆ ప్రక్రియ జరగకపోవడంపై ఆరా తీశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు నేటికీ పరిశీలించకపోవడం, లాగిన్‌ వినియోగించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. అనంతరం చీరాల పట్టణంలోని గంజిపాలెంలో కలెక్టర్‌ పర్యటించారు. 91 సంవత్సరాల ఓటరు సయ్యద్‌ మస్తాన్‌తో ఆయన మాట్లాడారు. 50 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో సొంత ఇంటిలో నివసిస్తున్నప్పటికీ 2002 ఓటరు జాబితాలో ఆయన పేరు కనిపించకపోవడంపై విచారించారు. 15 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం అద్దంకిలో నివాసం ఉన్నట్లు ఆయన కలెక్టర్‌కు వివరించారు. ముందుగా పర్చూరు, కారంచేడు మండలాల్లో ఉన్నట్లు చెప్పడంతో విచారించారు. ఆయన కుమారుడిని పిలిపించి కలెక్టర్‌ విచారణ చేశారు. అద్దంకిలో ఉండి ఓటు వేసినట్లు చెప్పడంతో సంబంధిత యాప్‌లో గుర్తించి ఓటు ఉన్నట్లు గుర్తించారు. జిల్లా కలెక్టర్‌ వెంట ఇన్‌చార్జి ఆర్డీఓ లవన్న, మున్సిపల్‌ కమిషనర్‌ డానియేల్‌ జోసఫ్‌, తహసీల్దార్లు గోపీకృష్ణ, గీతావాణి, చీరాల, వేటపాలెం ఎంపీడీఓలు విజయ, రాజేష్‌, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement