వేమూరు: న్యాయపరమైన భూమికి సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియను అధికారులు కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. వేమూరు మండలంలోని చంపాడు గ్రామానికి చెందిన కాకాని కన్యాకుమారి, ఆమె కుమార్తె తహసీల్దారు కార్యాలయం వద్ద బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.... 4.75 సెంట్ల భూమిని రెవెన్యూ అధికారులు చట్ట విరుద్ధంగా అక్రమ మ్యుటేషన్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బాపట్ల జిల్లా కలెక్టరుకు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ ఇచ్చామని చెప్పారు. ఇంత వరకు పరిష్కారం కాలేదని తెలిపారు. గత నెల 29వ తేదీన జిల్లా కలెక్టరు తహసీల్దారు కార్యాలయానికి వచ్చి అర్జీకి సంబంధించిన రికార్డులు పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేకపోవడంతో మండల సర్వేయరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేశారు. అప్పటివరకు నిరసన కొనసాగుతుందని ఆమె హెచ్చరించారు.


