అంగట్లో పోస్టులు అమ్ముకున్నారు
అక్రమాల డీఎస్సీపై దద్దరిల్లిన భావపురి
అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గని యువత
మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
నిరుద్యోగులకు అన్యాయం చేసిన కూటమి సర్కారు
మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
బాపట్ల: నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన దగా డీఎస్సీపై వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. యువత చేపట్టిన నిరసన ప్రదర్శనతో బాపట్ల హోరెత్తిపోయింది. భారీగా యువత, నిరుద్యోగులు, పార్టీ శ్రేణులు తరలివస్తారనే సమాచారం మేరకు పోలీసులు భారీగా మోహరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నుంచి పట్టణంలోని యువతను రాకుండా పలుచోట్ల అడ్డంకులు కల్పించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ యువత రెట్టించిన ఉత్సాహంతో నిరసనలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జెండాలతో చేపట్టిన నిరసన బాపట్ల భారీగా సోమవారం కొనసాగింది.
భారీగా మోహరించిన పోలీసులు
వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య ఆధ్వర్యంలో ద్విచక్రవాహనాలతో భారీ ప్రదర్శన చేపట్టేందుకు నిర్ణయించారు. పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్‌రేట్ వరకు ప్రదర్శనకు భారీగా చేరుకున్నారు. అయితే గడియార స్తంభం సెంటర్ వద్ద భారీగా పోలీసులు మెహరించి ద్విచక్రవాహన ప్రదర్శనను అనుమతి నిరాకరించారు. దీంతో పార్టీ కార్యాలయం నుంచి భారీ ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్‌వద్ద కూడా పోలీసులు నాయకులు, కార్యకర్తలను ముందుకుపోకుండా అడ్డుకున్నారు. శాంతియుత ప్రదర్శనను అడ్డుకోవటంపై మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేయటంతో కొద్దిమంది నాయకులను కలెక్టర్‌ను కలిసేందుకు అనుమతి ఇచ్చారు.
సీబీఐ విచారణ చేపట్టాలని వినతి
డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్‌కు నాయకులు వినతిపత్రం అందించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి విచారణ కొనసాగేవిధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా యువజన విభాగం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలురెడ్డి, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మేరుగ చందన్ నాగ్, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదన్ మోహన్‌గౌడ్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి నక్కా వీరారెడ్డి, మండే విజయ్‌కుమార్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి దొంతిబోయిన జయ భారత్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి జోషికాంత్, రేపల్లె అధికార ప్రతినిధి వీరేంద్ర, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు శీలం చంటి, రవి శంకర్ రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు యల్లావుల సోహిత్, అడే చందు, శాయిల మురళి,ఉరబిండి గోపినాధ్ తదితరులు ఉన్నారు.
డీఎస్సీలో కొన్ని పోస్టులను అంగట్లో సరుకుల టీడీపీ ప్రభుత్వం అమ్ముకుందని వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు జి.సురేంద్ర పేర్కొన్నారు. దగా డీఎస్సీపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేసే చంద్రబాబుకు సరైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
– జి.సురేంద్ర, వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు


