వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య
బాపట్ల: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేయాల్సిన దివ్యాంగుల శాఖ కార్యాలయం ఎప్పుడు మూసివేసి ఉండటాన్ని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం తీవ్రంగా ఖండించింది. సోమవారం కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. చల్లా రామయ్య మాట్లాడుతూ కూటమి పాలనలో దివ్యాంగుల శాఖ కార్యాలయం ఎప్పడు మూసివేసే ఉంటుందన్నారు. కనీసం సమస్యలు చెప్పుకునేందుకు కూడా ఎవరు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని స్పందన కార్యక్రమంలో అర్జీ రూపంలో ఏవో మల్లికార్జునరావుకు వినతి పత్రం అందించారు. నిరసనలో వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల నాయకులు ఎం శ్యాం ప్రకాష్, చల్లపల్లి గోపి, ఆసోది రామిరెడ్డి, ఆట్ల శ్రీనివాస్ రెడ్డి, బాబు, కొండమ్మ, వెంకటేశ్వరమ్మ, బాలాజీ, కళ్యాణ్, నాని పి.జి.ఆర్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
చికిత్సకని వెళుతూ తిరిగిరాని లోకాలకు..
వెల్దుర్తి: మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యశాలలో చికిత్స చేయించుకునేందుకు వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. మండలంలోని రచ్చమల్లపాడు గ్రామానికి చెందిన రెంటాల ఆదిలక్ష్మమ్మ (60)కు మోకాళ్ల నొప్పులు అధికం కావడంతో కొడుకు పాలంకయ్యతో కలిసి మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యశాలకు బయల్దేరింది. వీరిని మాచర్లలో గుంటూరు వెళ్లే ఫస్టు బస్సు ఎక్కించేందుకు ఆదిలక్ష్మమ్మ కుమార్తె కుమారుడు (మనవడు) ఐతంరాజు మారుతి(18) తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని మాచర్ల బస్టాండ్‌కు బయలుదేరాడు. ఈక్రమంలో సోమవారం తెల్లవారుఝామున 3.30గంటలకు వస్తున్న సమయంలో మాచర్ల నుంచి యర్రగొండపాలెం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం మాచర్ల – శ్రీశైలం జాతీయ రహదారిలోని మండాది బోడు వద్ద బలంగా ఢీ కొట్టడంతో బండి పై ప్రయాణిస్తున్న వారు ఎగిరి రోడ్డు పక్కన పడ్డారు. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం సుమారు 60 అడుగుల దూరం లాక్కెల్లింది. ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న రెంటాల ఆదిలక్ష్మమ్మ, ఐతంరాజు మారుతిలు అక్కడికక్కడే మృతిచెందారు. రెంటాల పాలంకయ్య తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లాడు. మండాది నుంచి మాచర్లకు వస్తున్న వారు గమనించి క్షతగాత్రుడు పాలంకయ్య మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పాలంకయ్యకు ప్రథమ చికిత్స చేయగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నర్సరావుపేటకు తరలించారు. మారుతి తండ్రి అంజి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


