పోలీసులు తమ ఫిర్యాదును వక్రీకరించారంటున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అనంతవరం గ్రామంలో ఉద్రిక్తత ఆరోణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంటి ముందు మృతదేహంతో ధర్నా
యద్దనపూడి: మండలంలోని అనంతవరంలో శనివారం ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆదివారం యద్దనపూడి పోలీస్‌స్టేషన్ వద్ద, అనంతవరం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాలు.. అనంతవరంలోని బీసీ కాలనీకి చెందిన కుంచాల వీరకుమారి (27) తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని మరణించిన విషయం విధితమే. మృతురాలి తల్లిదండ్రులు ఆమెకు ఇష్టం లేని వివాహం చేయటానికి ప్రయత్నం చేశారని ఎస్‌ఐ రత్నకుమారి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఆదివారం పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. కాగా ఎస్‌ఐ రత్నకుమారి నిరక్షరాస్యులైన తాము చెప్పిన స్టేట్‌మెంట్‌ను వక్రీకరించి స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఆమె ఇష్టానుసారం ఫిర్యాదు నమోదు చేసుకోవటం దారుణమంటూ యద్దనపూడి పోలీస్‌స్టేషన్ వద్ద ఆదివారం మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు మీడియా ముందు వాపోయారు. తమ కుమార్తె బలవన్మరణానికి బీసీ కాలనీకి చెందిన తన్నీరు అశోక్ కారణమని, వీరకుమారి ఆత్మహత్య అనంతరం అతడు కుటుంబంతో సహా గ్రామం వదిలి పరారయ్యాడని అతని వేధింపుల కారణంగానే తమ బిడ్డ ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డ మృతికి అశోక్ కారణమని ఫిర్యాదు చేసినప్పటికీ ఎస్‌ఐ రత్నకుమారి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మృతదేహంతో ధర్నా
పోస్టుమార్టం నిర్వహించిన వీరకుమారి మృతదేహాన్ని ఆమె మరణానికి కారణమని చెబుతున్న నిందితుడు అశోక్ ఇంటిముందు ఉంచారు. తమకు న్యాయం జరిగే వరకు తమ కుమార్తె మృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించబోమని తెగేసి చెప్పారు. ఈ విషయమై మీడియా ప్రతినిధులు.. నిందితుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎస్‌ఐ రత్నకుమారిని ప్రశ్నించగా దర్యాప్తు చేస్తున్నామని.. నిందితుడు ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని చెప్పటం గమనార్హం. ఈ క్రమంలో స్టేషన్‌కు వెళ్లిన మీడియా సిబ్బందిని అధికారపార్టీకి చెందిన ఓ నాయకుడు ఇక్కడ మీడియాకు ఏం పని అంటూ ప్రశ్నించారు. నిందితుడు తమ కుమార్తెను లోబరచుకొని ఆత్మహత్యకు ప్రేరేపించి ఆమె మరణానికి కారకుడయ్యాడని, సెల్‌ఫోన్‌లో ఉన్న ఆధారాలతో అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడిపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే తామే అతనిపై చర్యలు తీసుకోవాల్సి వస్తోందని, అప్పటి వరకు తమ కుమార్తె మృతదేహన్ని నిందితుడి ఇంటిముందు నుంచి తొలగించబోమని, అంత్యక్రియలు కూడా నిర్వహించబోమని బాధిత కుటుంబ సభ్యులు తెగేసి చెబుతున్నారు.


