నేటి నుంచి ఆన్‌లైన్‌లో ప్రాథమిక ఉర్దూ శిక్షణ తరగతులు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఆన్‌లైన్‌లో ప్రాథమిక ఉర్దూ శిక్షణ తరగతులు

Jun 1 2026 4:07 AM | Updated on Jun 1 2026 4:07 AM

దుర్గమ్మకు కానుకగా అర కిలో వెండి దిమ్మె నేడు, రేపు అంతర్జాతీయ స్థాయి సుస్థిర నగరాల సదస్సు

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉర్దూ భాష నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన విద్యార్థులు, యువతకు ఉర్దూ ప్రాథమిక శిక్షణ తరగతులను సోమవారం నుంచి 30 రోజుల పాటు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియెట్‌ బోర్డు ఉర్దూ ప్రత్యేకాధికారి షేక్‌ నాగూర్‌వలీ ఆదివారం ఓప్రకటనలో పేర్కొన్నారు. ఉర్దూ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వంటి ప్రాథమిక అంశాలు సులభంగా బోధిస్తామని తెలిపారు. ఉర్దూ మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని, ఉర్దూ భాషను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు విద్యా, ఉపాధి రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్‌ స్థాయి లో ఉర్దూను చదవడంద్వారా విద్యార్థులు తమ మాతృభాషను పరిరక్షించుకోవడంతో పాటు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో ముందుకు వెళ్లగలరని, వివరాలకు 98851 39827 నంబర్లో సంప్రదించాలని సూచించారు.

రోడ్డు ప్రమాదంలో పాఠశాల

కరస్పాండెంట్‌ మృతి

రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో పాఠశాల కరస్పాండెంట్‌ మృతి చెందిన సంఘటన మండలంలోని మాచర్ల–గుంటూరు రహదారిపై అనుపా లెం చప్టా వద్ద శనివారం రాత్రి జరిగింది. గాడిపర్తి మురళీమోహన్‌ (52)దాచేపల్లిలో శారదా పాఠశాలకు కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తూ పాఠశాల నడుపుతున్నాడు. మురళీమోహన్‌ శనివారం ఉదయం తన వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంపై గుంటూరు వెళ్లి పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో అనుపాలెం చప్టా వద్ద రోడు పనులు నిమిత్తం ఏర్పాటు చేసిన రమ్మును ఢీకొనగా అక్కడికక్కడే రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయం తగలడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు 108 వాహనంలో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు నిర్థారించారు. బంధువులు మృతదేహాన్ని రాత్రే దాచేపల్లికి తీసుకెళ్లారు. రోడ్డు ప్రమాదంపై ఎలాంటి కేసు నమోదు కాలేదని రాజుపాలెం ఎస్‌ఐ మణికృష్ణ తెలిపారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం అరకిలో వెండిని కానుకగా సమర్పించారు. విజయవాడకు పేరువీటి స్వరూప రాణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. రూ. 1.36 లక్షల విలువైన అరకిలో వెండిని చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసా దాలు, శేషవస్త్రాలను బహూకరించారు.

పటమట(విజయవాడతూర్పు): ‘సస్టైనబుల్‌ సిటీస్‌ ఇంటిగ్రేటెడ్‌ అప్రోచ్‌ పైలట్‌ ఇన్‌ ఇండియా’ ముగింపు సదస్సు జూన్‌ 1, 2 తేదీల్లో విజయవాడలోని లెమన్‌ ట్రీ ప్రీమియర్‌ హోటల్‌లో నిర్వహించనున్నట్లు వీఎంసీ కమిషనర్‌ ధ్యానచంద్ర ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) సహకారంతో ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యునిడో), గ్లోబల్‌ ఎన్విరాన్మెంట్‌ ఫెసిలిటీ (జీఈఎఫ్‌), కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంవోయూహెచ్‌ఏ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ అఫైర్స్‌ (ఎన్‌ఊయూఏ) సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. పట్టణ సుస్థిరత, వాతావరణ చర్యల పురోగతి అనే అంశంపై నిర్వహించనున్న ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మున్సిపల్‌ కమిషనర్లు, అదనపు కమిషనర్లు, పట్టణాభివద్ధి నిపుణులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, స్వచ్ఛ భారత్‌ మిషన్‌, జీరో వేస్ట్‌ కార్యక్రమాల ప్రతినిధులు పాల్గొననున్నారన్నారు. ఈ సందర్భంగా యునిడో నిర్వహిస్తున్న జెమ్‌ అవార్డు – 2026 ను గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ప్రదానం చేయనున్నారని తెలిపారు. జూన్‌ 2న భాగస్వామ్య ప్రతినిధుల కోసం గుంటూరు జిల్లా జాగర్లమూడి వద్ద ఏర్పాటు చేసిన 500 కిలోవాట్ల తేలియాడే సౌర విద్యుత్‌ ప్లాంట్‌, ఇంటింటి చెత్త సేకరణకు వినియోగిస్తున్న ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాల చార్జింగ్‌ కేంద్రాలను సందర్శించే ప్రత్యేక ఫీల్డ్‌ విజిట్‌ కూడా నిర్వహించనున్నారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement