ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు
చిలకలూరిపేటటౌన్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోవడంతో ఐదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని పసుమర్రు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులంతా తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం త్రిపురానికి చెందిన యువకులుగా గుర్తించారు. త్రిపురారం గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు కారులో చీరాల బీచ్ విహారయాత్రకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపి, తిరిగి సొంతూరికి ప్రయాణమయ్యారు. కారు చిలకలూరిపేట మండలం పసుమర్రు పరిసరాల్లోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి, అతివేగంతో రహదారి పక్కనే ఉన్న పొలాల కాలువలోకి దూసుకువెళ్లింది. ప్రమాద తీవ్రతకు కారు తీవ్రంగా దెబ్బతినగా, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, హైవే సిబ్బంది వెంటనే స్పందించి కారులో చిక్కుకున్న యువకులను వెలుపలికి తీశారు. 108 వాహనంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో బాల్టి ప్రదీప్ అనే యువకుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ పథకానికి విజయవాడ లబ్బీపేటకు చెందిన ఎం. నరేంద్ర జ్యోతి రూ. 1,00,116ల విరాళాన్ని అందజేశారు. అలాగే అమ్మవారి నిత్యాన్నదానానికి సికింద్రాబాద్ సికింద్రాబాద్ వెంకటాపురానికి చెందిన వి. కల్కి చరణ్, శివానిల పేరిట కుటుంబ సభ్యులు రూ. లక్ష విరాళాన్ని అధికారులకు అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో దర్శనం కల్పించి ప్రసాదాలు, శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటం అందచేశారు.
వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ
గుంటూరు లీగల్: రైతులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆదివారం ఒక ప్రకనటలో డిమాండ్ చేశారు. పొన్నూరు మండలంలోని మామిళ్లపల్లి గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వారికి అండగా నిలిచిన వారితో పాటు నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేయడం దారుణమని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు. గిట్టుబాటు ధర లేక గోదాముల్లో దాచుకున్న మొక్కజొన్న బస్తాలను అక్రమ నిల్వలంటూ టీడీపీ నాయకులు దాడి చేసిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ రైతుల పక్షాన నిలవడం తప్పా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అనుచరులు చేసిన దుర్మార్గ చర్యను నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన రైతులు, నాయకులపై వరసగా కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన యంత్రాంగం, పాలకులు పట్టించుకోకుండా సంఘీభావ కార్యక్రమాల్లో పాల్గొన్న పార్టీ వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు, రేపల్లె సమన్వయకర్త పీట నాగమోహన్ కృష్ణ, అంబటి వెంకటేశ్వరరావు, ఆకుల వెంకటేశ్వరరావు, షేక్ మీరజ్, షేక్ గౌస్, ఖాదర్ బాషా, మమత, అంబటి పార్వతితో పాటు మరి కొంతమంది నాయకులపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన రెండు కేసులలో రైతులు, కూలీలు, నాయకులపై నమోదైన కేసులను పరిశీలిస్తే ఎమ్మె ల్యే ధూళిపాళ్ల నరేంద్ర కక్ష పూరితంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతుందని వెల్లడించారు. కేసులను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.


