కారుపై అకస్మాత్తుగా విరిగిపడిన భారీ వృక్షం | - | Sakshi
Sakshi News home page

కారుపై అకస్మాత్తుగా విరిగిపడిన భారీ వృక్షం

Jun 1 2026 3:55 AM | Updated on Jun 1 2026 3:55 AM

భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రయాణిస్తున్న ఒక కారుపై రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షం అకస్మాత్తుగా విరిగిపడిన సంఘటన ఆదివారం సాయంత్రం విద్యాధరపురంలో చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు కారు నడుపుతున్న వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సేకరించిన సమాచారం మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విద్యాధరపురం సితార జంక్షన్‌ నుంచి కుమ్మరిపాలెం సెంటర్‌ వైపు వెళుతున్న వెర్టిగ కారు చెరువు సెంటర్‌ సమీపంలో రోడ్‌ పక్కనే ఉన్న చిన్న సాయిబాబా గుడి వద్దకు వచ్చేసరికి కొన్నేళ్లనాటి పురాతన భారీ వృక్షం ఒక్క సారిగా విరిగి కారుపై పడింది. పోలీసులకు, నగరపాలక సంస్థ అధికారులకు సమాచారాన్ని అందించారు. స్థానికుల సహకారంతో కారులో ఇరుక్కుపోయిన వ్యక్తిని అతికష్టంపై బయటకు తీశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి నులకపేట రాజీవ్‌ కాలనీకి చెందిన కొక్కిలిగడ్డ రాజశేఖర్‌(45) ట్రావెల్స్‌ కారు నడుపుతూ ర్యాపిడో నిమిత్తం విజయవాడ వచ్చారు. తిరిగి తాడేపల్లి వెళిపోతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. కారుపై పడింది పెద్ద వృక్షం కావడంతో కారుకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్‌ నుంచి సితార జంక్షన్‌కు వెళ్లే ఈ అంబేడ్కర్‌ రోడ్‌లో నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రహదారిలో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భారీ వృక్షాలను తొలగించాల్సిన అవసరం ఉందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement