మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు

May 31 2026 1:30 AM | Updated on May 31 2026 1:30 AM

ఆపరేషన్‌ దండాయన పోస్టర్‌ ఆవిష్కరణ మహిళా సంబంధిత కేసుల్లో 60 రోజుల్లో చార్జిషీట్‌ ఎస్పీ ఉమామహేశ్వర్‌

చీరాల: మహిళలపై నేరాలకు పాల్పడితే దండన తప్పదని ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ హెచ్చరించారు. చీరాల కొత్తపేటలోని రావి జయలక్ష్మి, సుబ్బారాయుడు కల్యాణ మండపంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో శనివారం మహిళల భద్రత, సాధికారతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో మహిళలు, బాలికలపై జరిగే నేరాల విషయంలో జిల్లా పోలీస్‌శాఖ జీరో టాలరెన్స్‌ పాలసీని అవలంబిస్తోందని, నిందితులు ఎంతటి ప్రభావశీలులైనా చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, మహిళా సంబంధిత కేసుల్లో నిర్దేశిత 60 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి కోర్టుల్లో చార్జిషీట్‌ దాఖలు చేయడం తప్పనిసరి చేశామన్నారు. తీవ్రమైన కేసులను ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులకు బదిలీ చేసి నిందితులకు అత్యంత వేగంగా కఠిన శిక్షలు పడేలా పోలీస్‌ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యమన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మహిళలపై నేరాలకు పాల్పడిన 37 మందికి కోర్టుల ద్వారా జైలు శిక్షలు ఖరారయ్యాయన్నారు. ఇందులో ఆరుగురికి జీవిత ఖైదు, మరో ఐదుగురుకి 20 ఏళ్ల సుదీర్ఘ జైలుశిక్ష, 26 మందికి పదేళ్లు అంత కంటే తక్కువ కాలం జైలుశిక్ష పడేలా పోలీస్‌ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేసిందన్నారు. లైంగిక దాడులు గృహ హింస, పోక్సో కేసుల్లో నేరస్తులపై శిక్షలు పడేలా చేయడం, నేరాల నియంత్రణ లక్ష్యంగా ఆపరేషన్‌ దండాయన కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. మహిళలు, బాలికల భద్రత కోసం పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ వాడకం పెరిగిందని, ప్రతి మహిళ, విద్యార్థిని స్మార్ట్‌ ఫోన్‌లో శక్తి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 వేలకు పైగా శక్తి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్నారు. ఎవరైనా ఫోన్‌ చేసి ఓటీపీలు అడిగినా, ప్రైజ్‌ మనీ పేరుతో బ్యాంకు ఖాతా వివరాలు అడిగినా నమ్మవద్దన్నారు. ఆన్‌లైన్‌లో మోసాలకు గురై డబ్బులు పోగొట్టుకుంటే తక్షణమే 1930 సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. డిజిటల్‌ అరెస్ట్‌ల పేరుతో భయపెడితే మోసపోవద్దని, డిజిటల్‌ అరెస్ట్‌ లేదన్నారు. అనంతరం పోలీస్‌శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్‌ దండాయన పోస్టర్‌ను ఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్‌, సీడీపీఓ ఝాన్సీరాణి, చీరాల సెయింట్‌ ఆన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మి, చీరాల మహిళా కాలేజి లెక్చరర్‌ నీలిమ, గౌతమి కాలేజీ ప్రిన్సిపాల్‌ రవీంద్ర, పోలీస్‌ అధికారులు, మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement