కొల్లూరు: పెనుగాలల ధాటికి ప్రజలు బెంబేలెత్తారు. అర్ధరాత్రి వేళ విరుచుకుపడిన గాలులు.. జోరు వాన కారణంగా కృష్ణా నదీ పరివాహక గ్రామాలు అతలాకుతలమయ్యాయి. గురువారం రాత్రి కన్ను పొడుచుకున్నా కానరాని రీతిలో కురిసిన కుంభవృష్టికి గాలులు తోడయ్యాయి. భీకర మెరుపులు.. చెవులు చిల్లులు పడేలా ఉరుముల తాకిడికి ప్రజలు భయకంపితులయ్యారు. ఈ అకాల వర్షం, పెనుగాలల ధాటికి కృష్ణా పరివాహక లంక గ్రామాలలో వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్తు స్తంభాలు విరిగి పడటంతో గురువారం రాత్రి నుంచి కొల్లూరు మండలంలోని కొల్లూరు, చిలుమూరు, జువ్వలపాలెం, సుగ్గునలంక సబ్‌స్టేషన్‌ల పరిధిలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం వాటిల్లింది. రేపల్లె – తెనాలి ప్రధాన మార్గంతోపాటు, ఇతర రహదారులపై భారీ వృక్షాలు కూలిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాటి, ఇతర చెట్లు విద్యుత్తు లైన్లపై పడటంతో స్తంభాలు అధిక సంఖ్యలో విరిగిపడ్డాయి. గురువారం రాత్రి 10 నుంచి శుక్రవారం సాయంత్రం వరకు సుమారు విద్యుత్తు సరఫరాకు అంతరాయం వాటిల్లింది. సిబ్బంది కూలిన వృక్షాలను తొలగించి మరమ్మతులు చేపట్టారు. అనంతరం విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు.
వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం
లంక గ్రామాల పరిధిలో సాగులో ఉన్న వాణిజ్య పంటలకు పెనుగాలుల కారణంగా తీవ్ర నష్టం ఏర్పడింది. మండలంలోని ఈపూరు, చిలుమూరు, చిలుమూరులంక, సుగ్గునలంక, ఈపూరులంక, చింతర్లంక, పెదలంక, పోతార్లంక, తిప్పలకట్ట, జువ్వలపాలెం, కిష్కిందపాలెం, తడికలపూడి గ్రామాల పరిధిలో అరటి పంట తీవ్రంగా దెబ్బతింది. ఉద్యాన శాఖాధికారులు 500 ఎకరాల విస్తీర్ణంలో అరటి పంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. పంట నష్ట తీవ్రత వెయ్యి ఎకరాల వరకు ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య పంటలైన తమలపాకు, బొప్పాయిలకు స్వల్ప నష్టం వాటిల్లింది. ఇటుక పరిశ్రమపై సైతం వర్షం ప్రభావం పడింది. పచ్చి ఇటుక తడిసి ముద్దగా మారింది. పెనుగాలుల ధాటికి వాణిజ్య పంటలు దెబ్బతినడంతో రూ. కోట్లలో నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.


