కొల్లూరు: కాలుష్యం నుంచి తమను కాపాడాలని, లేదంటే ఓటు హకై ్కనా తొలగించాలని జిల్లా కలెక్టర్‌కు ఓ వ్యక్తి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కొల్లూరు మండల పరిషత్తు సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆవులవారిపాలెంకు చెందిన సనకా రవి ఈ మేరకు అర్జీ ఇచ్చారు. అందులో... ఇటుక బట్టీల కారణంగా వెలువడుతున్న కాలుష్యంతో అనారోగ్యం పాలవుతున్నామని వాపోయారు. రహదారుల వెంబడి నిబంధనలకు విరుద్ధంగా బట్టీలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. గతంలోనూ ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించకుంటే తన ఓటు హక్కు రద్దుకు సిఫార్సు చేయాలని, తాను సైతం ఎలక్షన్ కమిషనర్‌ను లేఖ ద్వారా ఇదే విషయాన్ని కోరానని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను ప్రయివేటు భూములుగా సర్వే చేయడంపైనా మరో అర్జీ అందజేశారు. శుక్రవారం పీజీఆర్‌ఎస్‌లో 78 అర్జీలు అందినట్లు అధికారులు వెల్లడించారు. దేవదాయ శాఖ భూములను ఖాళీ చేయకుండా భట్టిప్రోలు మండలానికి చెందిన వ్యక్తి ఇబ్బందులు సృష్టిస్తున్నాడని ఓ ఫిర్యాదు అందింది. మండల పరిషత్తులకు పీఎంఏజేవై నిధులు కేటాయించి... పనులయ్యాక బిల్లుల సమయంలో వెనక్కు తీసుకోవడంతో ఇబ్బందులు పడుతున్నామని టీడీపీ నాయకులు కలెక్టర్‌కు అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికారులు నిర్లక్ష్య ధోరణి వీడాలన్నారు. క్షేత్ర స్థాయిలోనే సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, వేమూరు మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, ఎంపీడీఓ అమృతలూరు స్పందన, అధికారులు పాల్గొన్నారు.
రికార్డులు పరిశీలన
వేమూరు: పీజీఆర్‌ఎస్ దరఖాస్తులు వెంటనే పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. వేమూరు తహసీల్దారు కార్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీజీఆర్‌ఎస్ దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. కొన్ని రికార్డులు కనిపించడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీఆర్‌ఎస్ దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు రవీంద్ర, మండల సర్వేయర్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు.
– అడ్డగోలుగా ఇటుక బట్టీల నిర్వహణపై జిల్లా కలెక్టర్‌కు వినతి


