భార్యపై దాడి కేసులో నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

భార్యపై దాడి కేసులో నిందితుడి అరెస్టు

May 30 2026 2:44 AM | Updated on May 30 2026 2:44 AM

పొలం ఆక్రమించిన కౌలు రైతు

కర్లపాలెం: మద్యం తాగి భార్యతో గొడవపడి ఆమె మెడపై కత్తితో నరికిన కేసులో నిందితుడు చింతాయపాలెంకు చెందిన ఇనుముల రమేష్‌ను శుక్రవారం అరెస్ట్‌ చేసినట్లు కర్లపాలెం ఎస్‌ఐ ఎస్‌ఐ రవీంద్ర తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 12రోజులు జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించటంతో బాపట్ల సబ్‌ జైలుకు తరలించారని ఎస్‌ఐ రవీంద్ర తెలిపారు.

స్టాఫ్‌నర్సుల ఫైనల్‌ మెరిట్‌ లిస్టు విడుదల

గుంటూరు మెడికల్‌: ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జీజీహెచ్‌లో 150 కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న వారి ఫైనల్‌ మెరిట్‌ లిస్టును శుక్రవారం విడుదల చేసినట్లు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ జి.శోభారాణి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫైనల్‌ మెరిట్‌ లిస్టులో క్లరికల్‌, టైపో గ్రఫికల్‌, తప్పిదాలు ఏమైనా ఉంటే అభ్యంతరాలు ఉంటే ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ఫైనల్‌ మెరిట్‌ లిస్టును సీఎఫ్‌డబ్ల్యూ.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు.

మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ పాట విడుదల

గుంటూరు రూరల్‌: వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి డాక్టర్‌ కొమ్మెర్ల శివకుమార్‌ రచించిన మెగా డీఎస్సీ కాదు–ఇది దగా డీఎస్సీ పాటను వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య శుక్రవారం విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలు, అ వ్యవస్థలు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ఈ పాటలో ప్రస్తావించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

కోర్టును ఆశ్రయించిన భూమి యజమాని

నాదెండ్ల: నా తండ్రి ద్వారా సంక్రమించిన ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకున్న వ్యక్తి ఆక్రమించుకుని తనపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడంటూ ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధిత రైతు చిలకలూరిపేట పట్టణంలో నివాసం ఉండే సిద్ధాబత్తుని కోటేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో నా తండ్రి నరసింహారావుకు 1971లో నాదెండ్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని 476–2బి సర్వే నెంబరులో ఐదెకరాల భూమిని ప్రభుత్వం కేటాయించి పట్టా మంజూరు చేసిందన్నారు. కొన్నేళ్లు తామే వ్యవసాయం చేసుకుని పంట పండించి జీవించామన్నారు. తాను డ్రైవర్‌గా పనిచేస్తూ సుమారు 1990లో పొలాన్ని గ్రామానికి చెందిన బత్తిన కోటేశ్వరరావు అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చినట్లు తెలిపాడు. ప్రతి ఏటా కౌలు చెల్లిస్తూ వచ్చిన కోటేశ్వరరావు, కొన్నేళ్ళుగా సదరు పొలం తనదంటూ కౌలు ఇవ్వకుండా తనను, తన కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని వాపోయాడు. ఈ విషయమై పలుమార్లు కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, చేసేది లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపాడు. న్యాయస్థానం తీర్పు వెలువడే వరకూ బత్తిన కోటేశ్వరరావును పొలంలోకి వెళ్ళకుండా అధికారులు అడ్డుకోవాలని కోరాడు.

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం

ఒకరు మృతి–పలువురికి గాయాలు

నూజెండ్ల: మండల పరిధిలోని బుర్రిపాలెం గ్రామానికి చెందిన పోతుగంటి బాలిశెట్టి (70) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రకాశం జిల్లా మేడపి సమీపంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. బాలిశెట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లి వస్తుండగా మేడపి సమీపంలో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్ళింది. ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు కాగా వారిని ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో బాలిశెట్టి మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈయనకు భార్య సుబ్బమ్మ ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని గ్రామానికి తరలించగా శుక్రవారం జరిగిన అంత్యక్రియల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలిశెట్టి గ్రామంలో 22 సంవత్సరాలుగా ప్రభుత్వ రేషన్‌ దుకాణం నిర్వహిస్తూ వివాదరహితుడిగా పేరు తెచ్చుకొన్నారు.

నాలుగు కేసుల్లో నిందితుడికి శిక్ష

పిడుగురాళ్ల: నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి శిక్ష పడినట్లు పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మాచర్ల పట్టణానికి చెందిన అడిగే మనీ పవన్‌కుమార్‌ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లను ధ్వంసం చేసి వాటిలోని రాగి(కాపర్‌) వైర్‌ చుట్టలను దొంగలించిన కేసులో కోర్టు శిక్ష విధించినట్లు తెలిపారు. పిడుగురాళ్ల పట్టణంలో రెండు కేసులు, మాచరవరం పోలీస్‌ స్టేషన్‌లో ఒక కేసు, మాచర్ల పట్టణంలో ఒక కేసులు నమోదయ్యాయి. పిడుగురాళ్ల కోర్టు పరిధిలోని కేసును న్యాయమూర్తి టి. ప్రవల్లిక విచారణ చేసి ఆరు నెలల సాధారణ జైలు శిక్షతోపాటు రూ. 1000 చొప్పున అపరాధ రుసుం విధించారు. అపరాధ రుసుం చెల్లించని పక్షంలో అదనంగా 15 రోజుల జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించినట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement