గణనీయంగా పెరిగిన పశుగ్రాసం, దాణా ధరలు వెన్నశాతం పేరుతో తక్కువ ధరకు పాల కొనుగోలు ఎండల తీవ్రతకు తగ్గిపోయిన పాల ఉత్పత్తి పాడి రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
వ్యవసాయం, పాడిపరిశ్రమ రైతులకు రెండు కళ్లు. అయితే ప్రస్తుతం వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరిగి, పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టాలు చవి చూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా రైతులు పాడిపశువుల పోషణ ద్వారా తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ప్రస్తుతం పాడిపరిశ్రమ కూడా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రైతుల వద్ద నుంచి డెయిరీ యజమానులు లీటర్ పాలను రూ.60కి కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో వెన్నశాతం పేరుతో రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయిస్తున్నారు. గణనీయంగా పశుగ్రాసం, దాణా ధరలు పెరిగినా పాడి రైతులను ఆదుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు.
చీరాల టౌన్: బాపట జిల్లాలోని చీరాల, బాపట్ల, పర్చూరు, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో 2024లో నిర్వహించిన 21వ పశుగణన ప్రకారం ఆవులు 21,930, గేదెలు 3,81,764, గొర్రెలు 2,49,394, మేకలు 30,691 ఉన్నాయి. ఏడాదికి జిల్లాలో 51.60 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఏడాదికి నాలుగు విధాలుగా పాల ఉత్పత్తిని లెక్కిస్తారు. ఎండాకాలంలో మాత్రం పాల దిగుబడి చాలా వరకు తగ్గిపోయింది. పశువులకు సరైన దాణా, గడ్డి అందుబాటులో లేకపోవడంతో పాల ఉత్పత్తి పడిపోయింది. చీరాల మండలంలోని 15 గ్రామ పంచాయితీల్లో రోజుకు దాదాపు 56 వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. గతంలో రోజుకు లక్ష లీటర్లపైగా పాల దిగుబడులు వచ్చేది. ప్రస్తుతం పశుపోషణ చేయలేక రైతులు పశువులను అమ్ముకుంటున్నారు. దీంతో పాల దిగుబడి గణనీయంగా పడిపోయింది.
పశుగ్రాసం, దాణా ధరలు చుక్కల్లో..
పశుపోషణకు ప్రధాన ఆధారమైన ఎండు గ్రాసం, దాణా ధరలు చుక్కలను అంటుతున్నాయి. దీనికి ప్రధాన కారణం యంత్రాల సహాయంతో వరిపైర్లు కోసి వేయటంతో గడ్డి పనికిరాకుండా పోతోంది. దీంతో ఉన్న కొద్దిపాటి ఎండు వరిగడ్డి ఎకరా ట్రాక్టర్ బాడుగతో కలిపి దూరాన్ని బట్టి రూ. 20 వేల నుంచి రూ.25 వేలు పలుకుతోంది. అంత ధర పెట్టి పశుపోషకులు ఎకరాల లెక్కన గడ్డి కొనుగోలు చేయలేక చిల్లరగా రోజువారీగా ఒకటి రెండు మోపులు తెచ్చుకుని పశువులను పోషించుకుంటున్నారు. ఒక ఎండుగడ్డి మోపు రూ.150 వరకు ధర పలుకుతోంది. పశువులకు వరిగడ్డితోపాటు తవుడు, పిట్టు వంటి రోజువారీ దాణాలు తప్పనిసరిగా పెట్టాలి. మార్కెట్‌లో బియ్యంతోపాటు తవుడు రేటు కిలో రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతుంది. అదే రీతిలో పశువులకు వేసే వివిధ రకాల దాణా రేట్లు చుక్కల్లో ఉన్నాయి.
ఎండల తీవ్రతకు తగ్గిన ఉత్పత్తి
ఒక వైపు ఎండ తీవ్రత పెరగడం, పచ్చిమేత లేకపోవడంతో పశువుల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. రోజుకు 6 లీటర్లు ఇచ్చే గేదె ప్రస్తుతం 4 లీటర్లకు మించి ఇవ్వటంలేదు. దీంతో పశుపోషకులు ఇబ్బందులు పడుతున్నారు. బాపట్ల జిల్లాలోని రేపల్లె, వేమూరు లంక గ్రామాలు, బాపట్ల మండలంలోని కంకటపాలెం, నర్సాయపాలెం, చెరుకూరు, కారంచేడు తదితర మండలాలలో వరి పండించే గ్రామాల నుంచి ట్రాక్టర్లలో రైతులు వరి గడ్డిని కొనుగోలు చేస్తున్నారు.
వెన్న శాతం పేరుతో మోసం..
రైతు తమ పశువులను ఎంతో కష్టపడి పోషించుకుంటూ వాటి ద్వారా వచ్చే పాలను దగ్గరలో ఉండే కేంద్రాలకు విక్రయిస్తుంటారు. పాలకేంద్రాల నిర్వాహకులు మాత్రం రైతు ఇచ్చిన పాలకు వెన్నశాతం ఆధారంగా ధర నిర్ణయిస్తారు. నిర్వాహకులు ప్రకటించిన వెన్నశాతం ఆధారంగా రైతులు తెచ్చిన పాలను కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన యంత్రం సహాయంతో శాతం నిర్ణయిస్తారు. వెన్నశాతం 5 వచ్చిన పాలకు ఒక ధర, 8 శాతం వస్తే మరో ధర, 10 శాతం వస్తే ఇంకో ధర నిర్ణయించారు. కేంద్రాలకు పాలు తెచ్చిన వారిలో ఎక్కువ మందికి 5–7 శాతం వరకే తమ వెన్నశాతం మిషన్ ద్వారా ధరలు నిర్ణయించి ఇస్తుంటారు. కేవలం కొద్దిమందికి మాత్రం 8 నుంచి 9 శాతం వేస్తుంటారు.
బహిరంగ మార్కెట్‌లో భారీగా...
రైతుల దగ్గర పాల కేంద్రాల ద్వారా సేకరించిన పాలకు లీటర్ రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయిస్తున్నారు. అవే పాలు రైతుల వద్ద కేంద్రాల్లో కేవలం రూ.50 నుంచి రూ.60 కే కొనుగోలు చేస్తున్నారు. ఆ పాలల్లో వెన్న తీసుకుని మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పాల డెయిరీలు మార్కెట్‌లో పాల ప్యాకెట్‌లను చిల్లర వ్యాపారులకు విక్రయిస్తుంటారు. ఆ చిల్లర దుకాణదారులు వినియోగదారులకు విక్రయిస్తుంటారు. ఇక్కడా వినియోగదారుడికే టోపీ పెడతున్నారు. ఆరుగాలం కష్టపడి పశువులకు పోషించే రైతుకు మాత్రం పాల ధరలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దళారులుగా వ్యవహరించే పాల డెయిరీలు, చిల్లర వ్యాపారులు మాత్రం రైతులు తెచ్చే పాలపై వ్యాపారం నిర్వహించి లాభాలు గడిస్తున్నారు. రైతులు వ్యవసాయంలోనే కాక పాడిపరిశ్రమలోనూ దగా పడిపోతున్నారు.


