‘కుందేరు’లో కబ్జాల జోరు | - | Sakshi
Sakshi News home page

‘కుందేరు’లో కబ్జాల జోరు

May 28 2026 1:40 AM | Updated on May 28 2026 1:40 AM

‘కుందేరు’లో కబ్జాల జోరు

భారీగా రొయ్యల చెరువుల సాగు చీరాల పట్టణ ప్రాంతంలో భారీ భవనాలు 483.88 ఎకరాలు హాంఫట్‌ అన్యాక్రాంతంపై అధికారుల చర్యలు శూన్యం

వేటపాలెం: కుందేరు.... ఒకప్పుడు చీరాల నియోజకవర్గానికి జీవనాడి. గతంలో తీరప్రాంతమైన చీరాలకు తరచూ వచ్చే విపత్తులను తట్టుకుని లోతట్టులో ఉన్న ఈ ప్రాంతాన్ని ముంపు నుంచి బయట పడేసేది. తీర ప్రాంతానికి ఆనుకుని ఉండే గ్రామాలు భారీ వర్షాలు, తుపాన్లు వంటి వైపరీత్యాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటి ప్రవాహాన్ని కుందేరు ద్వారా సముద్రంలో కలుస్తుంది. చీరాల మండలం ఈపురుపాలెం స్ట్రయిట్‌ కట్‌ దగ్గర నుంచి కుందేరు మొదలై వేటపాలెం మండలం మీదుగా పయనించి చిన్నగంజాం మండలం పల్లెపాలెం దగ్గర సముద్రంలో కలుస్తుంది. దీని పొడవు 47.5 కిలోమీటర్లు కాగా, వెడల్పు 300 మీటర్లు ఉంటుంది. కుందేరు మొత్తం విస్తీర్ణం 1376.76 ఎకరాలు ఉండాలి. దీనిలో 483.88 ఎకరాలు ఆక్రమణలకు గురైందని అధికారులు తేల్చారు. అక్రమణలకు గురైన భూమి విలువ సుమారు రూ. 725 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

బడాబాబుల దర్జా

కుందేరు ప్రాధాన్యత తగ్గిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో కాలువగా మిగిలిపోయింది. కుందేరు భూములు మాత్రం దశాబ్దాల కాలంగా ఆక్రమణలకు గురవుతున్నాయి. గతంలో నిరుపేదలు మాత్రమే ఆ భూముల్లో నివాసం ఏర్పరుచుకునేవారు. కుందేరు చీరాల పట్టణం మధ్యలో ఉండటంతో ఆ భూములకు రెక్కలొచ్చాయి. నివాసాలున్న ప్రాంతాల్లో ఎకరా రూ.30 లక్షల నుంచి రూ. 40 లక్షలు ఉంది. వేటపాలెం, పందిళ్లపల్లి ప్రాంతాల్లో రొయ్యల చెరువులు ఉన్న ప్రాంతాల్లో అయితే ఎకరం రూ.30 లక్షల నుంచి రూ.45 లక్షలు వరకు పలుకుతోంది. విలువైన భూములు మూడొంతులు బడా బాబుల కంబంద హస్తాల్లో చిక్కుకున్నాయి. చీరాల ప్రాంతంలో పలువురు కుందేరు ఆక్రమించి భారీ భవనాలు, ఫ్యాక్టరీలను నిర్మించేశారు. వేటపాలెం, పందిళ్లపల్లి, మొటుపల్లి ప్రాంతాల్లో చాలామంది రొయ్యల చెరువు ఏర్పాటు చేసుకొని సాగుచేస్తున్నారు. మరికొందరు రొయ్యల చెరువులను లీజుకు ఇస్తున్నారు. ఆక్రమణ దారుల నుంచి భారీ మొత్తాల్లో నగదు తీసుకుని మౌనంగా ఉన్నారని విమర్శలున్నాయి. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కళ్లెదుటే ఆక్రమణలకు గురవుతున్నా ప్రభుత్వ యంత్రాంగం స్పందించడం లేదు. చీరాల, కొత్తపేట వరకు ఈ తంతు సాగుతోంది. కొందరు ఈ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు.

కుందేరు భూమి వివరాలు (ఎకరాల్లో)

మండలం అసలు భూమి ఆక్రమణకు గురైనది

చీరాల 267.12 20.18

వేటపాలెం 656.06 173.26

చిన్నగంజాం 452.98 290.44

Advertisement
 
Advertisement
Advertisement