‘ఉల్లాస్‌ –అక్షర ఆంధ్ర’ను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘ఉల్లాస్‌ –అక్షర ఆంధ్ర’ను విజయవంతం చేయాలి

May 28 2026 1:40 AM | Updated on May 28 2026 1:40 AM

బాపట్ల: ‘ఉల్లాస్‌– అక్షర ఆంధ్ర‘ కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరంలో సమర్థంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. ఉల్లాస్‌ జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్లో నిర్వహించారు. తొలి విడతగా గత ఏడాది ప్రారంభించిన ‘ఉల్లాస్‌– అక్షర ఆంధ్ర‘ కార్యక్రమం జయప్రదంగా నిర్వహించినట్లు గుర్తు చేవారు. గతేడాదిలో 62,286 మంది వయోజనులకు అక్షరాభ్యాసం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. 66,023 మంది వయోజనులు పరీక్షలలో ఉత్తీర్ణులై అక్షరాస్యులుగా మారారని చెప్పారు. బాపట్ల జిల్లా 99.60 శాతం పురోగతి సాధించినట్లు వివరించారు. మంచి పురోగతి సాధించడంపై సంబంధిత అనుబంధ శాఖల అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. నిరక్షరాస్యులైన వయోజనులు చదవడం, రాయడం, ప్రాథమిక గణితం, డిజిటల్‌ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత, జీవన నైపుణ్యాలు వృద్ధి చేయడమే అక్షరాంధ్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, సామాజిక భవనాలు, గ్రామ, వార్డు అభ్యాస కేంద్రాలలో ఈ తరగతులు నిర్వహించాలని కోరారు. ప్రణాళికబద్ధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే సులువుగా అక్షరాస్యత పెంచవచ్చన్నారు. అక్షరాస్యత సాధన దిశగా అధికారులు చిత్త శుద్ధితో పనిచేయాలని కలెక్టర్‌ అన్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో 25 లక్షల మందిని అక్షరాస్యులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించిందన్నారు. అందులో భాగంగా బాపట్ల జిల్లాలో 63,550 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ సూచించారు.

పాండురంగాపురం రోడ్డు విస్తరణ

పర్యాటక ప్రాంతమైన బాపట్ల– పాండురంగాపురం బీచ్‌ ఆర్‌ అండ్‌ బీ రహదారి విస్తరణ పనులు త్వరగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై జిల్లా కలెక్టర్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు.

● చీరాలలో ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలను త్వరగా నిర్మించి, వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్‌ చెప్పారు. భవన నిర్మాణాల్లో జరుగుతున్న జాప్యంపై ఆయన ఆరా తీశారు. ఏపీఎంఐడీసీ ఇంజినీరింగ్‌ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆటిజం సెంటర్‌, భవిత సెంటర్‌ త్వరగా పూర్తిచేయాలన్నారు.

● ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం బాపట్ల తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 2002 ఓటర్ల జాబితాలో నమోదైన ఓటర్లను గుర్తించి, 2025 ఓటర్ల జాబితాలో ఉన్న వారిని మ్యాపింగ్‌ చేయాలని సూచించారు. సమీక్షలో బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, తహసీల్దార్‌ సలీమా, కర్లపాలెం తహసీల్దార్‌ కె.శ్రీదేవి, పీవీ పాలెం తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు, మున్సిపల్‌ డీఈ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఎస్టీలు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

బాపట్ల: ఎస్టీలు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌ కుమార్‌ తెలిపారు. వీరికి సంబంధించి బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగులు, ఎస్టీలు తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. వీరిని కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. ప్రతి అర్జీని పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రతి నెల నాలుగో శుక్రవారం నిర్వహించే దివ్యాంగులు, ఎస్టీల పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం ఇక నుంచి ప్రతి నెల నాలుగో బుధవారానికి మార్పు చేశామన్నారు. జేసీ భావన వశిష్ఠ, డీఆర్‌ఓ జి.గంగాధర్‌ గౌడ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement