అమరావతి: వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలతో విద్యుత్ సరఫరాలో ఉత్పన్నమయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం రాయపూడి సీఆర్‌డీఏ విద్యుత్ ప్రాంగణంలో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశామని సీఆర్‌డీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చిరుమామిళ్ల వెంకటేశ్వరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 24 గంటలు పని చేసే విధంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. క్యాపిటల్ డివిజన్ పరిధిలోని తుళ్లూరు, తాడికొండ, అమరావతి, పెదకూరపాడు మండలాల వినియోగదారులు 1912 టోల్‌ప్రీ నంబర్‌కుగాని 9490615518 నంబరుగాని ఫోన్‌చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని కోరారు.
శాంతియుత వాతావరణంలో బక్రీద్ నిర్వహించాలి
నగరంపాలెం: బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వర్తించుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. త్యాగానికి, సహనానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ను శాంతి, సామరస్య వాతావరణంలో చేసుకోవాలని అన్నారు. జిల్లాలోని ప్రధాన మసీదులు, మదరసాలు, ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్త్ కొనసాగుతుందని అన్నారు. సున్నితమైన ప్రాంతాలపై నిఘా ఉంటుందని అన్నారు. సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక దృష్టిసారించామని చెప్పారు. ప్రార్థనా స్థలాలు, రద్దీ కూడళ్లల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ వివరించారు.
భట్టిప్రోలు: బాపట్ల జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు సంబంధించిన ఎన్నికలు ఈ నెల 31వ తేదీన నిర్వహించాల్సి ఉండగా... జూన్ 19 తేదీకి వాయిదా వేస్తున్నట్లు కార్యవర్గం పేర్కొంది. ఎండ తీవ్రత, వడగాల్పులను దృష్టిలో ఉంచుకుని క్రీడాకారులు, సభ్యుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరగనున్నట్లు నిర్వాహకుడు పాలాటి హనుమంతరావు తెలిపారు.


