ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణ | - | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణ

May 28 2026 1:40 AM | Updated on May 28 2026 1:40 AM

విజిలెన్స్‌, రెవెన్యూ అధికారుల సంయుక్త తనిఖీలు కొలతలు తీసి అక్రమాలు నిజమేనని తేల్చిన అధికారులు

చీరాల అర్బన్‌: చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై అందిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అక్రమ తవ్వకాలు వాస్తమేనని వెల్లడైంది. అక్రమ తవ్వకాలకు సంబంధించిన కొలతలు నమోదు చేసుకున్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. చీరాల నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మీడియాలో అనేక పర్యాయాలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు ఒంగోలు రీజనల్‌ విజిలెన్స్‌ స్క్వాడ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ సీహెచ్‌ సురేష్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం చీరాల మండలం బోయినవారిపాలెం పరిధిలో రెవెన్యూశాఖకు సంబంధించి ఆర్‌ఐ, సర్వేయర్‌, వీఆర్వోలతో కలిసి విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలు ఏ మేరకు జరిగాయని కొలతలు తీశారు. బుధవారం వేటపాలెం మండలం పందిళ్లపల్లి పరిధిలో ఎర్రగేటు సమీపంలోని పలు సర్వే నెంబర్లలో జరిగిన ఇసుక తవ్వకాలకు సంబంధించి పందిళ్లపల్లి వీఆర్వో కృష్ణవేణి, వీఆర్‌ఏ రమేష్‌లతో కలిసి విచారణ చేపట్టారు. తవ్వకాలకు సంబంధించిన కొలతలు నమోదు చేసుకున్నారు. రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ శంకరయ్య, టెక్నికల్‌ అసిస్టెంట్‌ కృష్ణారెడ్డి, ఫిర్యాదుదారురులు, పలువురు రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement