పోలీసు స్టేషన్‌పై దాడి, ఘర్షణ కేసులో నిందితుల అరెస్టు సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకొని పలు స్టేషన్లకు తరలింపు దాడితో సంబంధం లేని వ్యక్తులనూ అదుపులోకి తీసుకోవడంపై ఆక్షేపణలు సీసీ టీవీ ఫుటేజీలు వెలుగులోకి రాకుండా చర్యలు.. అరెస్టులపైనా గోప్యత ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి సజావుగా దర్యాప్తు చేయడంపైనా అనుమానాలు
సంబంధం లేని వారిపైనా కేసులు?
కొల్లూరు: రాజకీయ ఒత్తిళ్లతో నలిగిపోతూ చేతులు కట్టేసుకొని కాలక్షేపం చేస్తున్న ఖాకీలు ఎట్టకేలకు అరాచక శక్తుల కోసం రంగంలోకి దిగారు. చంద్రబాబు ప్రభుత్వంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో పచ్చ పార్టీ నేతలు చట్టాలను పక్కనపెట్టి అనుయాయులు, రౌడీ మూకలతో సాగిస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు కొల్లూరు పోలీసులు ముందుకు కదిలారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో ఇన్నాళ్లూ వ్యహరించిన పోలీసులు చివరకు స్టేషనులోకి దుండగులు వచ్చి దాడులు చేసుకోవడం, ఖాకీలపైనా చేయి చేసుకోవడం ఉన్నతాధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. ఘర్షణ, పోలీసు స్టేషనుపై దాడి కేసులో మున్ముందు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా దర్యాప్తు కొనసాగించి నిందితులకు శిక్ష పడేలా వ్యవహరిస్తారా అనే అనుమానాలు కూడా ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. పీఎస్‌పై దాడికి దిగిన ఘటనతోపాటు టీడీపీ నాయకుల అనుయాయులు, జనసేన కార్యకర్తల కొట్లాట కేసులో నిందితులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇరు వర్గాలకు చెందిన 21 మంది నిందితులను అదుపులోకి తీసుకుని మంగళవారం తెల్లవారుజామున తెనాలి కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పర్చారు. నిందితులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. వీరిలో జనసేన కార్యకర్త జానకిరామయ్య వర్గానికి చెందిన 11 మందిని గుంటూరు జైలుకు తరలించారు. కొల్లూరులోని ఎస్సీ కాలనీకి చెందిన 10 మంది నిందితులను నెల్లూరు జైలుకు తరలించినట్లు సమాచారం. దాడి ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌లను నిశితంగా పరిశీలించి స్థానికుల సహకారంతో నిందితులను పోలీసులు గుర్తించారు.
వీధుల్లో పరుగెత్తినా వదల్లేదు..
కేసుల విషయంలో రాజకీయ, కుల సంఘాల ఒత్తిళ్లు అధికమవుతున్నా అరెస్టులకు పోలీసులు శ్రీకారం చుట్టారు. రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు తమ సిబ్బందితో కొల్లూరు పోలీసులతో కలసి కొల్లూరు, ఆవులవారిపాలెం, గాజుల్లంకలోని పలు ప్రాంతాలలో నిందితుల ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేశారు. సీసీ ఫుటేజ్‌ల ద్వారా దాడుల ఘటనలో సుమారు 40 నుంచి 50 మంది వరకు గుర్తించారు. ఎంతమందిపై కేసులు నమోదు చేశారనే అంశంలో పూర్తి గోప్యత పాటిస్తున్నారు. కొట్లాటలో ఉన్న నిందితులలో కొందరు ముందుగానే అరెస్టులను ఊహించి అజ్ఞాతంలోకి వెళ్లగా, మరొ కొందరు పోలీసులను చూసి పరారయినట్లు తెలుస్తోంది. పోలీసులు సైతం పారిపోతున్న వారిని వీధులలో వెంబడించారు. ఇతరుల గృహాలలోకి చొరబడి బాత్రూమ్‌ల్లో దాక్కున్నవారిని సైతం బయటకు లాగి సీనీ ఫక్కీలో అరెస్టు చేశారు. స్టేషన్‌లో దాడి ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ వెలుగులోకి రాకుండా ఉంచడం, నిందితుల పూర్తి వివరాల గోప్యత పాటించడం ప్రజలకు పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పోలీసు అధికారులు మాత్రం శాంతిభద్రతల పరిరక్షణకు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగానే కొంత గోప్యత పాటిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు.
ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తులపైనా కేసులు నమోదు చేసి అరెస్టు చేయడంపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే ఇరు వర్గాలకు చెందిన కుల సంఘాల నాయకులు సైతం పోలీసు అధికారులను కలసి కొట్లాటలో లేని వ్యక్తుల పేర్లు తొలగించాలని విజ్ఞప్తులు సైతం చేశారు. దాడులు జరుగుతున్న సమయంలో ఆపడానికి యత్నించిన వ్యక్తులను, దాడి నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించిన వారిని, ఓ పక్క నిల్చుని ఉన్న వారిపైన సైతం కేసులు నమోదు చేశారన్న విమర్శలు వెలువడుతున్నాయి. వీటికి తోడు ఆయా వర్గాలకు చెందిన కుల సంఘాల సైతం అక్రమ కేసుల విషయంలో అంతర్గత సమావేశాలు నిర్వహించుకుంటున్నాయి. తమ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. కొల్లూరు ఎస్సీ కాలనీ వాసులు అక్రమంగా అరెస్టు చేసినవారిని తక్షణం విడుదల చేయాలన్న డిమాండ్‌తో రహదారిపై ధర్నా చేపట్టారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అమాయకులను బలిచేయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే అభిప్రాయం ప్రజలలో వ్యక్తమవుతోంది.


