చందోలు(కర్లపాలెం): చందోలులోని బగళాముఖి అమ్మవారిని బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారి ఆలయానికి విచ్చేసిన ఎస్పీ కుటుంబ సభ్యులకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ తన పుట్టిన రోజున కుటుంబ సభ్యులతో కలసి బగళాముఖి అమ్మవారిని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జిల్లా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్‌రెడ్డి, ఈవో నరసింహమూర్తి ఎస్పీ కుటుంబ సభ్యులకు అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రసాదాలు అందజేశారు.
డీఎంహెచ్‌ఓలో అవినీతిపై చర్యలు తీసుకోవాలి
బాపట్ల: బాపట్ల డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుజన్‌మాదిగ కోరారు. జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్‌ను మంగళవారం కలసి వినతిపత్రం అందించారు. ఈపురుపాలెం ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఎస్ రాధాకృష్ణ ఏప్రిల్ 2024 సంవత్సరం నుంచి డిసెంబర్ 2025 వరకు విధులకు హాజరుకాకున్నా, ఎఫ్‌ఆర్‌ఎస్ వేయకపోయినా జీతం మంజూరు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకొల్లులో మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న భానుప్రకాష్ నెల మొత్తం మీద కేవలం వారం రోజులు కూడా రాడని, వచ్చిన వారం రోజులు కూడా, ఫుల్లుగా మద్యం సేవించి, సిబ్బందిని ఇబ్బంది పెడుతుంటాడని కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో నాయకులు ఆనంద్‌మాదిగ, శ్రీహరి ఉన్నారు.
వడదెబ్బతో మాజీ సర్పంచ్ మృతి
రొంపిచర్ల: రొంపిచర్ల మాజీ సర్పంచ్ పడాల వెంకిరెడ్డి (82) మంగళవారం మృతి చెందారు. ఆయన గత కొద్దిరోజులుగా విపరీతంగా కాస్తున్న ఎండలకు అస్వస్థతకు గురై, వడదెబ్బ తగిలి నరసరావుపేటలో ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన గ్రామ సర్పంచ్‌గా పనిచేసి గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన మృతదేహాన్ని వైఎస్సార్ సీపీ, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
హత్యాయత్నం కేసులో ఇద్దరికి రిమాండ్
ముప్పాళ్ళ: ద్విచక్రవాహనం పై వస్తున్న వ్యక్తిని ట్రాక్టర్ తో ఢీకొట్టి హత్యచేయబోయిన సంఘటనపై నమోదైన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ పి.అనిల్‌కుమార్ మంగళవారం తెలిపారు. మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన కత్తి శివారెడ్డి ఈ నెల 23వ తేదీన సత్తెనపల్లి నుంచి ద్విచక్రవాహనం పై వస్తుండగా, అదే గ్రామానికి చెందిన మధిర వీరారెడ్డి అతనికి అల్లుడు వరసైన అన్నపురెడ్డి కోటిరెడ్డిలు పాతకక్షల నేపధ్యంలో బొల్లవరం అడ్డరోడ్డు వద్ద మట్టిలోడు ట్రాక్టర్‌తో ద్విచక్రవాహనం వెనుకగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శివారెడ్డికి గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శివారెడ్డి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి అందుకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి సత్తెనపల్లి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విఽధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఓటర్ లిస్ట్ ‘సర్’ నైనా ప్రక్షాళన చేయాలి
గుంటూరు మెడికల్: రాష్ట్రంలో ప్రారంభం కాబోతున్న స్పెషల్ ఇంటెన్సీ రివిజన్(సర్)నైనా ఓటర్ లిస్టులను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల సమావేశంలో ఎన్నికల ముఖ్య అధికారి వివేక్ యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. అర్హత గల ఏ ఒక్క రాష్ట్ర పౌరుడిని ఓటు హక్కు కోల్పోకుండా... చనిపోయిన వారి, డూప్లికేట్ ఓటర్లను, దేశం, రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన వారి ఓట్లను గుర్తించి తొలగించాలన్నారు. అందులో ఎలాంటి లొసుగులు ఉండకుండా చూడాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ,రాష్ట్ర సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ టి.సేవకుమార్ విజ్ఞప్తి చేశారు. ఆధార కార్డుకు సిటిజన్ షిప్ విషయంలో ప్రాధాన్యం లేక పోయినా చనిపోయిన వారి ఓట్లను, డూప్లికేట్ ఓట్లను, దేశం, రాష్ట్రం విడిచి వెళ్లిన వారి ఓట్లను తొలగించడం కోసం... సర్‌లో ఓటర్ లిస్టులను ప్రక్షాళన చేయడంలో ఆధార్ కార్డు తప్పనిసరి చేయాలని కోరారు.


