రేపల్లె: అత్యవసర పరిస్థితుల్లో తరలిస్తున్న గర్భిణికి 108 అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగింది. వైద్య సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించడంతో తల్లి, శిశువు సురక్షితంగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. రేపల్లె మండలం లంకెవానిదిబ్బకు చెందిన చెందిన గర్భిణి నంబూరి అంకమ్మ (23)కు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఇది రెండో గర్భం కాగా, ఏడో నెలలోనే నొప్పులు అధికమవడంతో వైద్యులు పరిశీలించారు. మొదటి కాన్పు శస్త్రచికిత్స ద్వారా జరగడం, ప్రస్తుతం రక్తహీనత ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున 108 వాహనంలో అంకమ్మను తెనాలికి తరలించే ఏర్పాట్లు చేశారు. వాహనం రేపల్లె – పెనుమూడి హైవేకు చేరుకున్న సమయానికే అకస్మాత్తుగా నొప్పులు ఎక్కువ అయ్యాయి. పరిస్థితి విషమంగా మారుతుండటాన్ని గమనించిన ఈఎంటీ కేసన మహేష్ చాకచక్యంగా వ్యవహరించి అంబులెన్స్‌లోనే ప్రసవం నిర్వహించారు. అంకమ్మ సురక్షితంగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అనంతరం వారిని తెనాలి హాస్పిటల్‌కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించారు. అత్యవసర సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడిన ఈఎంటీ కేసన మహేష్, పైలెట్ శ్రీనివాస్‌లను ఓఈ వెంకట మారుతి, డీఎం వెంకటేశ్వరరావులతో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు.
భార్య మృతికి కారణమైన భర్త అరెస్ట్
దాచేపల్లి: భార్య మృతికి కారణమైన భర్తని అరెస్ట్ చేసినట్లు సీఐ ఎం.రాజేష్ మంగళవారం తెలిపారు. మండలంలోని పెదగార్లపాడుకి చెందిన షేక్ జాన్‌బీ కుమార్తె ఆశాని మాచర్ల మండలం కొత్తూరుకి చెందిన షేక్ సుభానీకి ఇచ్చి గత 15 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కుమార్తె సంతానం. ఉపాధి కోసం వీరిద్దరు మండలంలోని గామాలపాడు గ్రామంలో నివాసం ఉంటున్నారు. సుభాని చెడు వ్యసనాలకు లోనై తరచూ భార్య ఆశాని హింసపెడుతున్నాడు. సుభాని మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, ఆశాని హింసలకు గురి చేయటంతో పాటుగా ఆత్మహాత్య చేసుకునేలా ప్రేరించాడు. దీంతో గత మార్చి నెల 6వ తేదీన ఇంట్లోనే చీరతో ఉరివేసుకుని ఆశా ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన సుభానిపై జాన్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుభానిని అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచామని సీఐ రాజేష్ చెప్పారు.
విత్తన దుకాణంలో విజిలెన్స్ తనిఖీలు
రూ. 45 లక్షల విలువ చేసే మిర్చి విత్తనాల అమ్మకాలు నిలిపివేత
ప్రత్తిపాడు: మిర్చి విత్తనాలు విక్రయించే దుకాణంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. వట్టిచెరుకూరు మండలం కర్నూతల గ్రామంలోని కర్షక్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మంగళవారం రాత్రి స్థానిక ఏవో సునీతతో కలిసి గుంటూరు విజిలెన్స్ సీఐ కె.చంద్రశేఖర్, ఎస్‌ఐ లక్ష్మీ మాధవిలు తనిఖీలు చేశారు. రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేకపోవడం, సరైన పత్రాలు చూపించక పోవడంతో సుమారు రూ.45 లక్షల విలువ చేసే మిర్చి సూపర్– 10 రకం విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేసినట్లు ఏవో తెలిపారు. విత్తనాల నమూనాలు సేకరించారు.


