స్వర్ణ(కారంచేడు): రాష్ట్రస్థాయి ఎడ్లబండి పోటీలు ఆకట్టుకున్నాయి. మండలంలోని స్వర్ణ గ్రామంలో స్వర్ణమ్మతల్లి తిరునాళ్ల సందర్భంగా స్వర్ణ–దగ్గుబాడు రోడ్డులోని గ్రామ సచివాలయం (పార్కు) సమీపంలో రాష్ట్రస్థాయి మైసూర్ ఎడ్ల బండలాగుడు పందేలు మంగళవారం నిర్వహించారు. ఈ పోటీల్లో మండలంలోని స్వర్ణ గ్రామానికి చెందిన రామాంజనేయులుకి చెందిన మైసూర్ ఎడ్ల జత ఈ ఏడాది ప్రథమ స్థానం కై వసం చేసుకున్నాయి. పోటీల్లో 14 ఎడ్ల జతలు తమ పేర్లు నమోదు చేసుకోగా ఎండల కారణంగా కేవలం 10 ఎడ్ల జతలు మాత్రమే పాల్గొన్నాయి. మొదటి స్థానం పొందిన రామాంజనేయులు ఎడ్ల జత నిర్దేశించిన 15 నిమిషాల సమయంలో 2498 అడుగుల దూరం లాగి గమ్యం చేరుకున్నాయి. తరువాత రెండో స్థానంలో ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కుందుర్రు గ్రామానికి చెందిన మందుల నజీర్, మందుల ఖాజావలీలకు చెందిన ఎడ్ల జత 2400 అడుగుల దూరం లాగాయి. మూడో స్థానాన్ని కూడా సంతమాగులూరు మండలం కుందుర్తి గ్రామానికి చెందిన ఉప్పు పండుకు చెందిన ఎడ్ల జత 2195 అడుగుల దూరం లాగాయి. నాలుగో బహుమతిని చీరాల–పేరాలకు చెందిన ఎడ్ల జత 2100 అడుగుల దూరం లాగాయి. విజేతల యజమానులకు ప్రథమ బహుమతిని గ్రామానికి చెందిన పగడాల బసవయ్య, సుబ్బారావులు రూ.20 వేలు, రెండో బహుమతిని రూ.15 వేలను కేళం శివరామకృష్ణప్రసాద్ అందించారు. మూడో బహుమతిని రూ.10 వేలు కటికి శింగయ్య, కొండే వెంకటేష్‌లు అందించారు. నాలుగో బహుమతిని రూ.5 వేలను ఎర్రిబోయిన రామాంజనేయులు అందించారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా శివరామకృష్ణప్రసాద్, కట్టా ప్రసాద్, పూల గోపిలు వ్యవహరించారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఎడ్ల జతలు పాల్గొన్నాయి.
రాష్ట్రస్థాయి మైసూర్ ఎడ్ల పోటీలు


