బాపట్ల మున్సిపాలిటీలో బ్రేక్
జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లో వార్డుల పెంపు
అంతా కూటమి నేతల కనుసన్నల్లోనే ..
వార్డుల పునర్విభజనపై రాజకీయ పార్టీల విముఖత
ముసాయిదాలో కనిపించని వీధుల పేర్లు
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో
వినతిపత్రాలు అందజేత
మున్సిపాలిటీల్లో వార్డుల విభజన ప్రక్రియ శాసీ్త్రయంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌బాబు ఆదేశాల మేరకు పార్టీ పట్టణ అధ్యక్షులు యాతం మేరిబాబు, పార్టీ నాయకులు ఆధ్వర్యంలో వార్డుల పునర్విభజన ప్రక్రియను న్యాయబద్దంగా చేపట్టాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. వార్డుల విభజనతో ప్రజలు గందరగోళంలో ఉన్నారని, ప్రజాప్రతినిధులకు, అధికారులకు పూర్తి అవగాహన లేకుండా విభజించడం అన్యాయమన్నారు. వార్డుల విభజనలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని, జనాభాకు తగ్గట్లుగా విభజన చేయాలన్నారు. వార్డుల్లో వైఎస్సార్ సీపీ ఓట్లను చీల్చేందుకు విభజన ప్రక్రియను అడ్డుపెట్టుకుంటున్నారని ఆక్షేపించారు.
చీరాల: జిల్లాలోని మున్సిపాలిటీల్లో వార్డుల విభజనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎటువంటి పారదర్శకత లేకుండా ప్రజాభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా కూటమి పార్టీలకు అనుకూలంగా విభజన ప్రక్రియ చేసినట్లు తేటతెల్లమవుతోంది. ఇటీవల మున్సిపాలిటీల్లో విడుదల చేసిన ముసాయిదా జాబితాలో వీధుల పేర్లు కనిపించడం లేదు. దీంతో వార్డుల విభజన అసంబద్ధంగా చేశారంటూ వైఎస్సార్ సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులకు వినతిపత్రాలు అందించారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలో చీరాల, బాపట్ల, రేపల్లె మున్సిపాలిటీలు ఉన్నాయి. వార్డుల పెంపు వివరాలు ప్రజలకు తెలియజేసేలా నోటీసు బోర్డుల్లో ఉంచి వారం రోజుల్లో అభ్యంతరాలు స్వీకరించాలని పురపాలక కమిషనర్లు సూచించారు. మున్సిపాలిటీల్లో జనాభా సంఖ్య ఆధారంగా వార్డుల విభజన ప్రక్రియను పురపాలక శాఖ చేపట్టింది. చీరాల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులు, రేపల్లెలో 28 వార్డులు ఉన్నాయి. అయితే బాపట్ల మున్సిపాలిటీలో శివారు గ్రామాల విలీనంపై హైకోర్టులో కేసు విచారణలో ఉండటంతో గత ఎన్నికలు నిర్వహించలేదు.
జనాభా ప్రాతిపదికన విభజన
మున్సిపాలిటీల్లో జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన ప్రక్రియపై అంచనాలు వేశారు. చీరాల మున్సిపాలిటీలో 2011 లెక్కల ప్రకారం 87 వేల మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం జనాభా లక్ష వరకు ఉందని అంచనా. మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా 11 వార్డులు పెరగడంతో ఆ సంఖ్య 44కు చేరింది. అలాగే రేపల్లె మున్సిపాలిటీలో 2011 లెక్కల ప్రకారం 54 వేల మంది జనాభా ఉండగా ప్రస్తుతం 60 వేల వరకు పెరిగింది. ఇక్కడ 28 వార్డులు ఉండగా ప్రస్తుత జనాభా ప్రకారం 8 వార్డులు పెంచడంతో 36కు చేరింది. వార్డుల విభజనకు మున్సిపాలిటీల్లో రౌండ్ ది క్లాక్ విధానంలో విభజన చేశారు. అలానే వార్డుల్లో జనాభా ప్రాతిపదికన జనాభా సంఖ్య ఆధారంగా వార్డులను పునర్విభజన చేశారు.
కూటమి నేతల కనుసన్నల్లోనే..
మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ పారదర్శకంగా చేపట్టలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనెల 17న మున్సిపాలిటీల్లో వార్డుల విభజన నమూనా ముసాయిదా జాబితా విడుదల చేశారు. టౌన్ ప్లానింగ్, సర్వేయర్లు కలిసి వార్డుల్లో జనాభా ప్రాతిపదికన వార్డులను విభజించారు. రౌండ్ ది క్లాక్ విధానంలో విభజన చేసినా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా చేయడం అన్యాయమని పలు రాజకీయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. నమూనా ముసాయిదా జాబితాలో వీధుల పేర్లు లేవు. ఏ ప్రాంతం ఏ వార్డులో ఉందో, ఎంత జనాభా ఉందో తెలియడం లేదు. ఒకే సామాజికవర్గం ఉన్న వార్డులను విభజించి వేరే సామాజికవర్గం వారిని కలిపారు. గతంలో ఒకే సామాజికవర్గం వర్గం ఎక్కువగా ఉన్న వారిని విభజించారు. విభజించిన వార్డుల్లోనూ రోడ్డు కనెక్టివిటీ లేనట్టు తెలుస్తోంది. అస్తవ్యస్తంగా చేపట్టిన పునర్విభజనతో పట్టణ ప్రజల్లో గందరగోళంళ నెలకొంది. ఇదంతా కూటమి నేతల కనుసన్నల్లోనే సాగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బాపట్ల మున్సిపాలిటీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 77 వేల మంది జనాభా ఉండగా ప్రస్తుతం లక్ష వరకు పెరిగింది. ఏడు శివారు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై కొందరు 2020 సంవత్సరంలో హైకోర్టుకు వెళ్లడంతో స్టే విధించింది. దీంతో 2021 మార్చిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించలేదు. ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన వార్డుల సంఖ్య పెంపుదల, ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. కోర్టులో స్టే ఎత్తేస్తేనే ఎన్నిక నిర్వహించేందుకు అవకాశం ఉంది.


