కొల్లూరులో కొనసాగిన ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

కొల్లూరులో కొనసాగిన ఉద్రిక్తత

May 26 2026 3:26 AM | Updated on May 26 2026 3:26 AM

దళితవాడలో అరెస్టులను నిరసిస్తూ రాస్తారోకో

రెండు గంటలపాటు రేపల్లె – తెనాలి రోడ్డుపై బైఠాయించి నిరసన

గొడవకు సంబంధం లేని వారిని

అదుపులోకి తీసుకున్నారంటూ ఆగ్రహం

కోడి కత్తితో దాడి చేసిన యువకుడిని,

ఆ సామాజిక వర్గం వారిని అరెస్టు చేయలేదంటూ నిలదీత

కొల్లూరు: పోలీసు స్టేషన్‌పై దాడి ఘటనకు సంబంధించిన వ్యవహారంలో కొల్లూరులో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. సోమవారం దాడి ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ఇతర ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్‌లకు తరలించడం ఆందోళనకు దారితీసింది. కొల్లూరు దళితవాడకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున పోలీసుల అరెస్టులను నిరసిస్తూ సోమవారం రాత్రి రహదారి దిగ్భందించి నిరసన చేపట్టారు. పోలీసులు ఏకపక్ష ధోరణితో కేసులు నమోదు చేసి కొట్లాట, పోలీసు స్టేషన్‌లో దాడి ఘటనతో సంబందం లేని వ్యక్తులను, ఊరి నుంచి చుట్టం చూపునకు వచ్చిన పిల్లలను సైతం తీసుకుపోయారంటూ రేపల్లె – తెనాలి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. సుమారు రెండు గంటలకు పైగా రోడ్డు మధ్యలో బైఠాయించి వాహనాల రాకపోకలు కొనసాగకుండా రోడ్డుపై ఆందోళ చేపట్టారు. ఎస్సీ కాలనీ వాసుల ఆందోళనతో రేపల్లె వైపు నుంచి వచ్చే వాహనాలు రాకపోకలు నిలిచిపోవడంతో అప్రమత్తమైన పోలీసులు వాహనాలను దోనేపూడి – కొల్లూరు కరకట్ట వైపు మళ్లించారు. వేమూరు సీఐ పీవీ ఆంజనేయులు, కొల్లూరు, వేమూరు ఎస్‌ఐలు కోటేశ్వరరావు, శ్రీనివాసరావులు ఆందోళన చేపట్టిన ప్రాంతానికి చేరుకొని వారికి నచ్చచెప్పి రాస్తారోకోను విరమించేందుకు యత్నించారు. అయితే దళితవాడ వాసులు తమ యువకులపై కోడి కత్తితో దాడి చేసిన యువకుడిని, కొట్లాటకు కారణమైన ఆ యువకుడికి చెందిన వ్యక్తులపై కేసులు నమోదు చేయలేదంటూ, వారిని అదుపులోకి తీసుకోలేదని పోలీసులపై విరుచుకుపడ్డారు. దీనిపై సీఐ దాడి ఘటనలో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తిపై కేసు నమోదు చేశామని, కోడి కత్తితో దాడి చేసిన యువకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు, హత్యాయత్నం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని నచ్చచెప్పారు. తమ వారిని అదుపులోకి తీసుకొని గుర్తు తెలియని ప్రాంతాలకు తరలించడంపై పోలీసులను నిలదీయడంతో స్థానికంగా ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఇరు పక్షాలకు చెందిన వ్యక్తులను పలు స్టేషన్‌లకు తరలించడం జరిగిందని, ఇందులో ఎటువంటి పక్షపాతం లేదని వివరించారు. అమాయకులపై కేసులు నమోదు విషయంలో సీసీ పుటేజ్‌లు పరిశీలించి ప్రమేయం ఉన్న వ్యక్తులనే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పోలీసు స్టేషన్‌కు వస్తే సీసీ టీవీ పుటేజ్‌లు చూపించి అనుమానాలు నివృత్తి చేస్తామని హామీ ఇవ్వడంతోపాటు, కొన్ని వీడియోలను ఫోన్‌లో చూపడంతో శాంతించిన దళితవాడ వాసులు ఆందోళనను విరమించారు. అనంతరం వాహనాల రాకపోకలను పునరుద్ధరించిన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement