బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా, చట్ట పరిధిలో విచారించి సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మొత్తం 59 మంది అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీతో విన్నవించుకున్నారు. బాధితుల అర్జీలలో ప్రధానంగా భార్యాభర్తల వివాదాలు, కుటుంబ సమస్యలు, భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మోసాలు తదితర సమస్యలు ఉన్నాయి. ఫిర్యాదిదారుల సమస్యలను కూలంకషంగా విన్న ఎస్పీ, వారి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, సత్వరమే స్పందించి వేగవంతంగా పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదిదారుల అర్జీలను చట్ట పరిధిలో విచారించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీలు మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో సంతృప్తికరమైన శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, పీజీఆర్‌ఎస్ సెల్ ఇనన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్


