ఆహార భద్రత – పోషకాహార సాధనలో మహిళలే ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

ఆహార భద్రత – పోషకాహార సాధనలో మహిళలే ఆదర్శం

May 26 2026 3:26 AM | Updated on May 26 2026 3:26 AM

ఆహార భద్రత – పోషకాహార సాధనలో మహిళలే ఆదర్శం అంతర్జాతీయ ప్రతినిధుల బృందం ప్రశంస

కొల్లిపర(తెనాలి): ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆహార భద్రత, పోషకాహార మెరుగుదల, మహిళా సాధికారత సాధ్యమవుతోందని అంతర్జాతీయ ప్రతినిధుల బృందం అభిప్రాయపడింది. రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్‌ఎస్‌) ఎగ్జిక్యూటివ్‌ వైస్‌చైర్మన్‌ విజయ్‌ కుమార్‌, గ్లోబల్‌ అలయనన్స్‌ ఫర్‌ ఎ సస్టైనబుల్‌ ప్లానెట్‌ (జీఏఎస్‌పీ) సెక్రటరీ జనరల్‌ సత్య ఎస్‌.త్రిపాఠి, వోయసీ వెంచర్స్‌ సహ వ్యవస్థాపకులు ఫిలిప్‌ కుస్తో జూనియర్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ హైకో హెన్నింగ్‌ సోమవారం సాయంత్రం కొల్లిపర మండలంలోని ప్రకృతి వ్యవసాయ నమూనాలను సందర్శించారు. ప్రకృతి వ్యవసాయం డీపీఎం రాజకుమారి ప్రతినిధుల బృందానికి స్వాగతం పలికారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ తొమ్మిది సూత్రాల చక్రాన్ని పరిశీలించిన ప్రతినిధులు ‘చాలా గొప్ప ఆలోచన’గా ప్రశంసించారు. వీసీ విజయ్‌కుమార్‌ ప్రకృతి వ్యవసాయ తొమ్మిది సూత్రాల ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా 365 రోజుల భూకవచం సూత్రం, పీఎండీఎస్‌ విత్తనాల పెలైటెజేషన్‌ విధానాన్ని వివరించార. తక్కువ నీటి వినియోగంతో అధిక మొలక శాతం సాధించగల పద్ధతిగా పెలైటెజేషన్‌ విధానాన్ని వారు అభినందించారు. అనంతరం మహిళా రైతు జి.లక్ష్మి సాగు చేస్తున్న సూర్య మండల పోషకాహార తోటను సందర్శించారు. ఇరవైకి పైగా రకాల పంటలు, కూరగాయలు, ఆకుకూరలతో ఏర్పాటుచేసిన ఈ నమూనాను పరిశీలించిన ప్రతినిధులు సంతృప్తిని వ్యక్తంచేశారు. రైతు లక్ష్మి సేవలను అభినందించారు. ముఖ్యంగా ఫిలిప్‌ కుస్తో జూనియర్‌, గ్రామ ఆరోగ్యం, పోషకాహారంపై శ్రద్ధను ప్రశంసించారు. అనంతరం ఆర్‌ఎస్‌కే కేంద్రంలో అభ్యుదయ వీఓ, ధనలక్ష్మి స్వయం సహాయక సంఘ సభ్యులతో సమావేశమయ్యారు. అక్కడి గ్రామ ప్రొఫైల్‌, మహిళా సంఘాల కార్యకలాపాలు, ఆహార బుట్ట కార్యక్రమాన్ని డీపీఎం వివరించారు. ఫిలిప్‌ కుస్తో జూనియర్‌ మాట్లాడుతూ, ‘ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు, వ్యవసాయ నమూనాలు చూశాను...అయితే ఇక్కడ మహిళలు కుటుంబ ఆరోగ్యం, పోషకాహారం కోసం చేస్తున్న కృషి ఎంతో ప్రేరణాత్మకం’గా చెప్పారు.‘మహిళలు సమాజ నిర్మాణంలో దేవతలతో సమానం...ఆహార బుట్ట కార్యక్రమం గ్రామీణ కుటుంబాల ఆరోగ్య భద్రతకు ఆదర్శ నమూనాగా నిలుస్తోందని ఈవీసీ విజయకుమార్‌ చెప్పారు. మహిళల భాగస్వామ్యం, ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్య–పోషకాహార కార్యక్రమాల సమన్వయం చూసి మహిళల నాయకత్వాన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రతినిధులు బృందం అభిప్రాయపడింది.

Advertisement
 
Advertisement
Advertisement