చెరుకుపల్లి: ప్రభుత్వం రేషన్ షాపులను మినీమాల్స్‌గా మార్చటానికి తీసుకున్న నిర్ణయం చాలా సంతోషకరంగా ఉందని, ఆ నిర్ణయాన్ని రేషన్ డీలర్లు స్వాగతిస్తున్నారని బాపట్ల జిల్లా రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి రవిచంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం చెరుకుపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డుదారులకు బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు సరుకులు అందించటానికి వీలుగా రేషన్ షాపులను మినీమాల్స్‌గా మార్చటం ఇటు కార్డుదారుడుకి నాణ్యమైన సరుకులు తక్కువ ధరకు అందించటంతోపాటు ఇటు రేషన్ డీలర్లకు కూడా ఆర్థిక వెసులుబాటు ఉంటుందన్నారు. మండల డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగుల పున్నారావు మాట్లాడుతూ వృద్ధులకు, వికలాంగులకు, 65సంవత్సరాలు పైబడిన వారికి రేషన్ డోర్ డెలివరి డీలర్‌ల ద్వారా అందిస్తున్నామని అందుకు డీలర్‌లకు కొంత మొత్తాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మినీమాల్స్ ఏర్పాటుకు ముందుకు రావాలని అందుకు స్థానిక అధికారుల ద్వారా పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రేషన్ డీలర్‌లు వై.రజనీకాంత్, ప్రసాద్, బాజీ, సుమలత తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు లీగల్: తప్పిపోయిన పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ కోరారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు తప్పిపోయిన పిల్లల దినోత్సవాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ పిల్లలు తప్పిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమన్నారు. తల్లిదండ్రులు పిలల్ల విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. గుడ్ టచ్, బాడ్ టచ్‌పై బాలికలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ిపిల్లలు తప్పిపోయిన, ఎక్కువ సమయం కనపడకపోయిన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదు తీసుకోని పక్షంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారికి అండగా ఉండి న్యాయం చేస్తుందని వివరించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ మెంబర్ దుర్గా భవాని, డీసీపీఓ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.


