హెచ్‌టీ పత్తి విత్తనాలునిల్వ చేసినా కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

హెచ్‌టీ పత్తి విత్తనాలునిల్వ చేసినా కఠిన చర్యలు

May 1 2026 5:45 AM | Updated on May 1 2026 5:45 AM

హెచ్‌టీ పత్తి విత్తనాలునిల్వ చేసినా కఠిన చర్యలు

జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు

సత్తెనపల్లి: హెచ్‌టీ పత్తి విత్తనాల నిల్వలు, అమ్మకాలకు రాష్ట్రంలో అనుమతి లేదని పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు అన్నారు. కమిషనర్‌, వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ గుంటూరు వారి ఆదేశాల మేరకు కమిషనర్‌ కార్యాలయ ఏడిఏ ప్రేమ్‌శేఖర్‌, వ్యవసాయ అధికారి సుకుమార్‌తో కలిసి పట్టణంలోని పలు విత్తన దుకాణాల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు. జగ్గారావు మాట్లాడుతూ విత్తన డీలర్లు కలుపు మందులు తట్టుకునే హెచ్‌టీ పత్తి విత్తనాలు నిల్వలు, అమ్మకాలకు మన రాష్ట్రంలో అనుమతి లేదన్నారు. అటువంటి పత్తి విత్తనాల విక్రయం చట్టరీత్యా నేరమన్నారు. నిషేధిత పత్తి విత్తనాలు ఎవరైనా విత్తన డీలర్లు నిల్వలు, అమ్మకాలు జరుపుతున్నారా అని తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విత్తన డీలర్ల దగ్గర ఇప్పటివరకు ఎటువంటి హెచ్‌టీ లక్షణాలు ఉన్నటువంటి పత్తి విత్తనాలు లేవని గుర్తించారు. పత్తి విత్తనాల నిల్వలు వచ్చిన వెంటనే విత్తన డీలర్లు మండల వ్యవసాయ అధికారి వారికి తెలియజేసి వారి అనుమతి మేరకు విక్రయాలు జరపాలన్నారు. ప్రతి విత్తన డీలర్‌ రైతులకు తప్పనిసరిగా విత్తన కొనుగోలు రసీదు ఇవ్వాలన్నారు. సత్తెనపల్లి మండల వ్యవసాయ అధికారి బి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విత్తన డీలర్లు అందరూ గుర్తింపు పొందిన డిస్ట్రిబ్యూటర్‌ వద్ద నుండి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. రైతులు లైసెన్సు ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. గుర్తింపు లేని మధ్యవర్తుల వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దన్నారు.అలాంటి మధ్యవర్తుల సమాచారం ఉంటే అధికారులకు తెలియ జేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement