అంజుమన్‌ ఇస్లామియాభూమిని లాక్కుంటే ప్రజా ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

అంజుమన్‌ ఇస్లామియాభూమిని లాక్కుంటే ప్రజా ఉద్యమం

Apr 8 2026 7:14 AM | Updated on Apr 8 2026 7:14 AM

● వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, పలు ముస్లిం సంస్థల నేతలు ● ముస్లింలంతా ఏకతాటి పైకి రోడ్డుపైకి వస్తాం

తెనాలి: ముస్లిం ధార్మిక సంస్థ అంజుమన్‌ ఇస్లామియాకు చెందిన మంగళగిరి మండలం చినకాకానిలోని భూమిని చంద్రబాబు ప్రభుత్వం ఇండస్ట్రియల్‌ పార్కు కోసం చేసిన భూసేకరణ ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఆ భూమిని తీసుకోవాలని చూస్తే ముస్లింలంతా రోడ్డుపైకి వస్తారని, అందరం ఏకతాటిపైన ఉన్నామని స్పష్టంచేశారు. చినకాకానిలోని అంజుమన్‌ ఇస్లామియాకు చెందిన 71.57 ఎకరాల వ్యవసాయ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్‌ పార్కు కోసం సేకరించేందుకు డిసెంబరులో నోటిఫికేషన్‌ జారీచేసిందని, దీనిపై సంస్థ జీవితకాల సభ్యులు, వివిధ ముస్లిం సంస్థల నాయకులు ప్రభుత్వానికి అభ్యంతరాలను తెలియజేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో తెనాలి సబ్‌కలెక్టర్‌ స్వయంగా వచ్చి తమ అభ్యంతరాలను తెలియజేయాలని నోటీసులు పంపారు. ఆ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం అంజుమన్‌ ఇస్లామియా సంస్థ జీవితకాల సభ్యులతో కలిసి నూరి ఫాతిమా రాతపూర్వక అభ్యంతరాలను ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్‌ లక్ష్మీకుమారికి తెలియజేశారు. గతేడాది జూన్‌లో ఆ భూమికి సంబంధించి 25 శాతం నష్టపరిహారం ఇచ్చినట్టుగా సబ్‌కలెక్టర్‌ నోట్‌లో ఉందనీ, పీపీపీ పద్ధతిలో తీసుకుంటామని చెప్పినట్టుగా వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అజీజ్‌ బోర్డు మీటింగులో వెల్లడించారని నూరి ఫాతిమా అన్నారు. ఇలా రకరకాలుగా ప్రభుత్వం ఎర వేస్తోందన్నారు. ముస్లిం యునైటెడ్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్‌ కలీం మాట్లాడుతూ చినకాకానిలో అంజుమన్‌ ఇస్లామియాకు గల భూమి 1915లో దాతలు ఇచ్చినదిగా గుర్తుచేశారు. 1962లో ప్రభుత్వ గెజిట్‌లో, తర్వాత సర్వే కమిషన్‌ రిపోర్టులో, 1998లో రెవెన్యూ రికార్డుల్లోనూ ఇంజుమన్‌ ఇస్లామియాను యజమానిగా నమోదై ఉందని గుర్తుచేశారు. అలాంటి భూమిని వక్ఫ్‌ పర్యవేక్షణలో ఉన్నట్టుగా చూపుతూ భూసేకరణ నోటిఫికేషన్‌ జారీచేయటంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. వెంటనే ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ముస్లింకు గల ఏకై క ఆస్తిని ప్రభుత్వం తీసుకోవాలని చూడటాన్ని చందోలుకు చెందిన ముస్లిం సమైక్య కమిటీ నాయకుడు మౌలా బేగ్‌ తీవ్రంగా ప్రశ్నించారు. ప్రాణాలైనా వదులుతామనీ, భూమిని వదులకోమని స్పష్టంగా చెప్పారు. ఆ భూమిని తీసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల ప్రజాఉద్యమం తప్పదని పలువురు హెచ్చరించారు. అన్ని అభ్యంతరాలను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామని ఇన్‌ఛార్జి సబ్‌కలెక్టర్‌ లక్ష్మీకుమారి తెలిపారు. వీరితో మంగళగిరి తహసీల్దార్‌ దినేష్‌ రాఘవేంద్ర కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement