తాడేపల్లిరూరల్: గంజాయి కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ వీరేంద్రబాబు తెలిపారు. తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వివరాలు వెల్లడించారు. రూరల్‌లో ఈగల్‌టీమ్ మెరుపుదాడి చేసి పాత నేరస్తుడితో పాటు మరో ముగ్గురు కొత్త నేరస్తులను గంజాయితో సహా పట్టుకుని తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు, ఎస్‌ఐలు ఖాజావలి, అపర్ణ మరికొంతమంది సిబ్బందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేసి మంగళవారం ప్రాతూరు కరకట్ట వద్ద పట్టుబడిన నలుగురితో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచినట్లు చెప్పారు. ఇందులో ప్రాతూరు గ్రామానికి చెందిన బండ్ల ప్రసాద్, గతంలో తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసుల్లో నిందితుడని, మంగళగిరిలో ఒక కేసులో ఉన్నట్లు వివరించారు. ప్రాతూరు కిరణ్ ఒక కేసులో, వల్లపనేని పవన్‌కళ్యాణ్‌పై విజయవాడ, దుగ్గిరాల, తాడేపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఆరు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. వీరితో పాటు పాతూరు కిరణ్, పాతూరు సతీష్, గుండిమెడ జోజిబాబు, కొవ్వూరు లాజర్‌ను అరెస్ట్ చేశామని, ఒక్కొక్కరి వద్ద 50 గ్రాముల చొప్పున 400 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వీరందరికి విజయవాడకు చెందిన చైతన్య అనే గంజాయి నేరస్తుడు గంజాయి సరఫరా చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని వెల్లడించారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
నేడు ఏఎన్‌యూలో ఈడబ్ల్యూఎస్ వర్క్‌షాప్
ఏఎన్‌యూ(పెదకాకాని): ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎంట్రప్రెన్యూర్షిప్ ఒకరోజు శిక్షణ శిబిరం ఏన్‌ఎన్‌యూలో నిర్వహించనున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.సునీత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో బుధవారం జరిగే వర్క్‌షాప్‌ను ఈడబ్ల్యూఎస్, బీసీ, చేతివృత్తులు, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ప్రారంభిస్తారన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్, వస్త్రాలు, చేతివృత్తులు, హస్తకళలు వంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాల్లో ఉన్న అవకాశాలతో పాటు, యుద్ధానంతర ప్రపంచ పరిస్థితుల్లో వాటి భవిష్యత్‌ను ఈ శిబిరంలో చర్చిస్తారని తెలిపారు.


