ప్రపంచ నాటక వినీలాకాశంలో గుంటూరు
భాషల సరిహద్దులు దాటి.. భావాల వారధిగా ‘భారత్‌రంగ్’ ‘వేదిక’ వేంకటేశ్వర విజ్ఞాన మందిరం ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు అంతర్జాతీయ నాటక మహోత్సవం
యడ్లపాడు: మనిషి మదిలోని ఘర్షణ..సమాజంలోని సంక్లిష్టతను..మట్టిలో పుట్టిన మమకారాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించే అద్భుత ప్రక్రియ ‘నాటకం’. అందులో భారత ప్రభుత్వపు ప్రతిష్టాత్మక భారత్‌రంగ్ మహోత్సవం ప్రపంచ నాటక రంగంలోనే ఒక మైలురాయి. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్‌ఎస్‌డీ) ప్రతి ఏటా నిర్వహించే ‘భారత్‌రంగ్’ కేవలం ప్రదర్శనల సమాహారం మాత్రమే కాదు, విశ్వవ్యాప్త సంస్కృతుల మహోన్నత సంగమం. అటువంటి నాటక కళా వైభవం, ఖండాంతరాలను దాటి మన గుంటూరు నగర ముంగిట కొలువుదీరబోతోంది. వందల మైళ్ల దూరం నుంచి, శతాబ్దాల చరిత్ర కలిగిన అరుదైన కళా రూపాలు ఇప్పుడు మన ముందుకు రానున్నాయి. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా డైరెక్టర్ చిత్తరంజన్‌త్రిపాఠి, యడ్లపాడు వేదిక(తెలుగు నాటక కళాపరిషత్తుల సమ్మేళన సంఘం) అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబుల కృషి ఫలితంగా గుంటూరు నగరానికి ఈ అరుదైన గౌరవం దక్కనుంది. ఇందుకు సంబంధించిన సమగ్ర కార్యాచరణను ప్రకటించారు.
సంయుక్త సంకల్పం
ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్‌ఎస్‌డీ), యడ్లపాడుకు చెందిన ‘వేదిక’ (తెలుగు నాటక కళాపరిషత్తుల సమ్మేళన సంఘం) సంస్థల సంయుక్త సారథ్యంలో ఐదు రోజులు గుంటూరు నగరం ఒక భావాల ప్రపంచంలా మారుతుంది. ఇందుకోసం గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరం, ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు ఒక ప్రపంచ స్థాయి వేదికగా రూపాంతరం చెందనుంది.
అభినవ భాష, మూగబోని భావోద్వేగం
ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంట నుంచి సాయంత్రం వరకు మన తెలుగు కళాకారుల జానపద, సాంస్కృతిక ప్రదర్శనలతో విజ్ఞాన మందిర ప్రాంగణం పులకించనుంది. సాయంత్రం 7గంట ల వేళ, విదేశీ భాషల స్వరాలు వినిపిస్తున్నా, రంగస్థలంపై పలికే అభినయం ప్రేక్షకుడిని ఆ కథలో లీనం చేస్తుంది. భాష అర్థం కాకపోయినా, నటుడి కళ్లలోని భావం ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతుంది.


