వైఎస్సార్‌సీపీతోనే ఎస్సీల సంక్షేమం
● ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని
కోరుకుంటారా? అని గతంలో
చంద్రబాబు ఎద్దేవా
● రోజురోజుకూ ఎస్సీలను చులకనగా
చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
● మళ్లీ వైఎస్ జగన్ సీఎంగా
వస్తేనే ప్రజలకు సంక్షేమం
● వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు
టీజేఆర్ సుధాకర్‌బాబు
బాపట్ల: పేదల బతుకుల్లో వెలుగులు నిండాలంటే మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవటంతోనే సాధ్యమని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టి.జె.ఆర్.సుధాకర్‌బాబు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా ఎస్సీసెల్ కార్యవర్గ సమావేశం బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సుధాకర్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీలపై దాడులు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా? అని సీఎం చంద్రబాబునాయుడే మాట్లాడటం చూసిన మనం ఆయన ఎస్సీలకు న్యాయం చేస్తారని నమ్మటం అవివేకం అన్నారు. ఎస్సీలను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునేందుకే ప్రభుత్వం ఉందన్నారు. ఎస్సీలకు ఆ పార్టీలో కూడా సరైన స్థానం లేదన్నారు. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవటంతోనే పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పారు. ఓసీలకు కేటాయించిన స్థానాల్లో కూడా ఎస్సీలకు అవకాశం ఇచ్చిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పయనిస్తున్నారని గుర్తు చేశారు. ఎంతో మంది పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించారని గుర్తు చేశారు.వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రూ.70వేల కోట్లు ఎస్సీల సంక్షేమానికి ఖర్చు చేయగా, చంద్రబాబు ఆ దిశగా అడుగులు కూడా వేయలేదని గుర్తు చేశారు. అధికారం చేపట్టిన ఏడాదిన్నరకు రూ.20వేల కోట్లు ఎస్సీలకు ఖర్చు పెట్టాల్సి ఉండగా.. ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని చెప్పారు. చంద్రబాబు సర్కారుకు ఎస్సీలు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున, టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రకాశం,బాపట్ల పరిశీలకులు బత్తుల బ్రహ్మనందరెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావు, సమన్వయకర్తలు కోన రఘుపతి, కరణం వెంకటేష్‌బాబు, వరికూటి అశోక్‌బాబు, ఈవూరి గణేష్, గాదె మధుసూదనరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వాసుమళ్ళ వాసు, రాష్ట్ర కార్యదర్శి మండే విజయ్‌కుమార్, నియోజకవర్గాల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బడుగు ప్రకాశరావు, అనిల్, బలరామ్, కమల్‌దేవ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


