అమరేశ్వరుని సొమ్ముకు ఎసరు
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరస్వామి వారి ఆదాయాన్ని ఇష్టారాజ్యంగా దారి మళ్లించి అధికంగా చెల్లింపులు చేయటంపై భక్తులలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరగాలని భక్తులు కోరుతున్నారు. అమరేశ్వరునికి హుండీ, భక్తుల విరాళాలు, ఆర్జితసేవలు, భూముల కౌలు ద్వారా ఆదాయం వస్తుంది. దీనిని స్వామి వారి కై ంకర్యాలకు ఖర్చు చేస్తుంటారు. ఏటా తరహాలో ఈ సంవత్సరం కూడా కార్తికమాసంలో భక్తుల సౌకర్యాలకు, స్వామి వారి అలంకారం కోసం పూలదండలు, టెంట్లు, క్యూలైన్‌ల నిర్వహణ, పాలు ఇలా తదితరాల కోసం టెండర్లు ఖరారు చేశారు. తర్వాత వీరికి ఆలయాధికారులు అధికంగా చెల్లించారనే ప్రచారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్తికమాసంలో క్యూలైన్‌ల నిర్వహణకు రూ.5,11,000, టెంట్లకు రూ.3.68 లక్షలు, ఇతర విభాగాల్లోనూ అధికంగా దేవుని సొమ్ము డ్రా చేసినట్లు సమాచారం. పాలు, పూలదండలు, బియ్యం సరఫరాకు స్వామివారి నిధులు ఉన్న బ్యాంకుల నుంచి డ్రా అయినట్లు ప్రచారం జరుగుతోంది. దేవాలయం పారిశుద్ధ్య టెండర్‌లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. వీటి వెనుక కృష్ణా జిల్లాకు చెందిన దేవదాయశాఖ ఉద్యోగి చక్రం తిప్పినట్లు భక్తులు చెబుతున్నారు. బాధ్యులపై దేవాలయ పాలకమండలి చర్యలు తీసుకుని, సీఐడీతో సమగ్రంగా విచారణ చేయించాలని భక్తులు కోరుతున్నారు.


