ప్రజలను నట్టేట ముంచిన ప్రభుత్వం
● ప్రజా వ్యతిరేక విధానాలను
తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలి
● ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా
నిలుస్తుంది
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
డాక్టర్ మేరుగ నాగార్జున
బాపట్ల: ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం నట్టేట ముంచిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మేరుగ నాగార్జున పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కేంద్ర పార్టీ కార్యాలయంలో బుధవారం జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రకాశం,బాపట్ల జిల్లాల కమిటీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, సెంట్రల్ పార్టీ పొలిటికల్ కో ఆర్డినేటర్ కందుల రవీంద్రరెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున మాట్లాడుతూ సూపర్‌సిక్స్ పేరుతో చంద్రబాబు సర్కారు ప్రజలను మోసం చేసిందన్నారు. హామీలు మాట పక్కనబెడితే సంక్షేమం జోలికే చంద్రబాబు సర్కారు వెళ్లడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టేందుకు తీసుకుంటున్న శ్రద్ధ ప్రజలకు మంచి చేసే వాటిపై లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దామని, ప్రజలకు వెన్నంటి ఉండేందుకు శక్తివంచన లేకుండా ముందుకు పోదామని సూచించారు.
కష్టపడే వారికి భవిష్యత్
– బత్తుల బ్రహ్మానందరెడ్డి
పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్ ఉంటుందని ప్రకాశం, బాపట్ల జిల్లాల టాస్క్‌ఫోర్స్ కమిటీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రజాసంక్షేమానికి చేపట్టిన పనులను చంద్రబాబు ప్రభుత్వం ఏవిధంగా నిర్వీర్యం చేసిందో ప్రజలకు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉండాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ పదే పదే చెబుతున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ పార్టీ పొలిటికల్ కో ఆర్డినేటర్ కందుల రవీంద్రరెడ్డి, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, బాపట్ల సమన్వయకర్త కోన రఘుపతి, చీరాల – కరణం వెంకటేష్‌బాబు, రేపల్లె – ఈవూరి గణేష్‌బాబు, వేమూరు – వరికూటి అశోక్‌బాబు, పర్చూరు – గాదె మధుసూదనరెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్‌బాబు, పార్టీ రాష్ట్రకార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య తదితరులు పాల్గొన్నారు.


