సచివాలయాల్లో ఈ–గవర్నెన్స్ అమలు
జడ్పీ చైర్‌పర్సన్ హెనీక్రిస్టినా
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): గ్రామీణ ప్రాంతాల్లోని సచివాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఈ – గవర్నెన్స్ అప్లికేషన్స్ అమలు చేయాలని గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్ హెనీక్రిస్టినా అన్నారు. జిల్లాపరిషత్ (జడ్పీ) ఆవరణలోని హాల్‌లో మంగళవారం పంచాయతీరాజ్ డిప్యూటీ ఎంపీడీఓలు, పరిపాలనాధి కారులు (ఏఓ), సీనియర్/ జూనియర్ సహాయకులు (ఎస్‌ఏ/జేఏ), పంచాయతీ అభివృద్ధి అధికారుల (పీడీఓ)కు ఈ–గవర్నెన్స్‌పై ఒక్కరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఈ–ఆఫీస్, పీఆర్–ఒన్, ఈ–క్రాప్, వాట్సాప్ యాప్ గవర్నర్స్ తదితర అంశాలపై పూర్తిస్థాయిలో శిక్షణ పొందాలని అన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లా స్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఈనెల ఒకట్నుంచి ఈ–ఆఫీస్ ద్వారా ఫైల్స్‌ను నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో దీనిపై తర్ఫీదు పొందేందుకు శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. డీపీఆర్‌సీ ఏఓ ప్రతాప్‌కుమార్, జడ్పీపీ ఏఓ శామ్యూల్, డీటీఎం కె.నాగేశ్వరరావు, రిసోర్స్ పర్సన్స్ కె.శ్రీనివాసరావు, కె.అనురాధ, డి.రవీంద్రబాబు, ఏ.శృతి, శిరీషరాణి ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల సిబ్బంది పాల్గొన్నారు.
రైల్ వన్ యాప్‌లో అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు కొనొచ్చు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): భారతీయ రైల్వేలు ఆర్ వాలెట్ మినహా అన్ని డిజిటల్ మార్గాల ద్వారా రైల్‌వన్ యాప్‌లో అన్ రిజర్వ్‌డ్ టికెట్ల కొనుగోలుపై 3 శాతం తగ్గింపును ప్రవేశపెట్టినట్లు గుంటూరు రైల్వే డివిజన్ పీఆర్‌ఓ వినయ్‌కాంత్ తెలిపారు. రైల్ వన్ యాప్ ఇటీవల భారతీయ రైల్వే ద్వారా ప్రారంభించబడిందని తెలిపారు. ఇది ప్రయాణికులకు తేలికగా వినియోగించేలా సమగ్రమైన అన్ని కలిసిన అప్లికేషన్ అని తెలిపారు. ఈ యాప్ అన్‌రిజ్వర్డ్ ప్లాట్‌ఫామ్ టికెట్లు, రిజర్వ్ టికెట్లు, లైవ్ ట్రైన్ ట్రాకింగ్, ఫిర్యాదుల పరిష్కారం, ఇ–క్యాటరింగ్, వంటి అన్ని ప్రయాణికుల సేవలను అనుసంధానిస్తుందని తెలిపారు. ప్రయాణికులు ఇంటి నుంచే తమ టికెట్లను (జర్నీ, ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు రెండు) బుక్ చేసుకోవచ్చని తెలియజేశారు. డిజిటల్ మార్గాల ద్వారా అన్ రిజర్వ్‌డ్ టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు 3 శాతం తగ్గింపును అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ నిబంధనలు 2026 జనవరి 14 నుంచి జులై 14 వ తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు. అయితే ఆర్–వాలెట్ ద్వారా అన్ రిజర్వ్‌డ్ టిక్కెట్లు కొనుగోలుకు 3 శాతం క్యాష్ బ్యాక్ ఇచ్చే ప్రస్తుత విధానం కొనసాగుతుందని తెలిపారు.
మరణానంతరం భూలక్ష్మి నేత్రదానం
మాచర్ల రూరల్: తన మరణానంతరం కూడా మరొకరికి వెలుగు ప్రసాదించిన తెడ్ల భూలక్ష్మి త్యాగనిరతిని ప్రజలు కొనియాడుతున్నారు. వివరాలలోకి వెళితే.. దుర్గిలో నివసించే తెడ్ల భూలక్ష్మి (65) గుండెపోటుతో సోమవారం మృతిచెందింది. మరణానికి ముందే ఈమె కుమారుడు తెడ్ల మురళి మాస్టర్ సూచన మేరకు మరణించిన తరువాత నేత్ర దానం చేస్తే చూపులేని వారికి కంటి చూపు అందించే అవకాశం కల్పించిన వారమౌతారని చెప్పిన ఆయన కుమారుడి సలహా మేరకు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా లయన్స్ క్లబ్, నల్గొండ చారిటీ ట్రస్టు వారికి అంగీకార పత్రాన్ని అందించారు. ఆమె మరణ వార్తను ట్రస్టు సభ్యులకు తెలుపగా మంగళవారం వారు వచ్చి వైద్యుల ఆధ్వర్యంలో ఆమె నేత్రాలను సేకరించారు.


