ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్టు
● రూ. 21.20 లక్షల విలువైన
37 వాహనాలు స్వాధీనం
● సాంకేతిక పరిజ్ఞానంతో
కేసులను ఛేదించాం
● ఎస్పీ బి.ఉమామహేశ్వర్ వెల్లడి
బాపట్ల: బాపట్ల జిల్లాలో వరుసగా చోటుచేసుకున్న ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను జిల్లా పోలీస్ యంత్రాంగం, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.21.2లక్షల విలువైన 37 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా పొత్తూరు గ్రామానికి చెందిన కగ్గ సాంబశివరావు, చీరాల పట్టణానికి చెందిన అన్నదమ్ములు దాసరి గోపిరాజు, దాసరి దుర్గారావులు ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడటంతో వారిన్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. నిందితుల్లో ఒకరైన కగ్గ సాంబశివరావు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ చెడు వ్యసనాలకు, విలాసాలకు అలవాటు పడటం వల్ల వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో, రెండు సంవత్సరాలుగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇళ్ల ముందు, ఆసుపత్రుల వద్ద పార్క్ చేసిన బైకులను దొంగతాళాలతో లాక్ తెరిచి దొంగతనం చేస్తూ వచ్చాడు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో వరుస దొంగతనాలు చేసినట్లు తేలింది. దొంగతనం చేసిన వాహనాలను ఇతర జిల్లాల్లో విక్రయించేవాడు. ఇతడి మీద గతంలో ఎటువంటి కేసులు లేవు. మొత్తం 33 బైకులను దొంగిలించినట్లు గుర్తించారు. బాపట్ల టౌన్ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. దాసరి గోపిరాజు, దాసరి దుర్గారావులు అన్నదమ్ములు. వీరు చీరాల పరిసరాల్లో చీపురులు అమ్ముతూ జీవనం సాగించేవారు. సంపాదన సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో 6 నెలలుగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. చీరాల 1 టౌన్, అద్దంకి టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మొత్తం 4 ద్విచక్ర వాహనాలను దొంగిలించారు. చీరాల 1 టౌన్ పోలీసులు వారిని ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు.
ప్రత్యేక బృందాలు ఏర్పాటు
ద్విచక్ర వాహనాల దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. గడిచిన వారం రోజుల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం రూ.40 లక్షల విలువ గల 60 బైకులను రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనాలకు సేఫ్టీ లాక్‌లు, జీపీఎస్ పరికరాలు అమర్చుకోవాలని తెలిపారు. లక్షల రూపాయలు ఖర్చుచేసి వాహనాలను కొనుగోలు చేసేవారు, వాహనాలు దొంగతనాలకు గురికాకుండా ఉండేందుకు సేఫ్టీ లాక్ లు, జిపిఎస్ ఏర్పాటు చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించవద్దని ప్రజలకు తెలిపారు.
పోలీసులకు అభినందనలు
ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను సమర్థవంతంగా ఛేదించి, నిందితులను అరెస్ట్ చేసి, 37 వాహనాలను సీజ్ చేసినందుకు సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, ఇన్‌స్పెక్టర్ ప్రేమయ్య, బాపట్ల టౌన్ ఇన్‌స్పెక్టర్ రాంబాబు, చీరాల 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు, సీసీఎస్ ఎస్‌ఐ రాంబాబు, సీసీఎస్ కానిస్టేబుల్స్ కోటేశ్వరరెడ్డి, కృష్ణ, సురేష్, దాసు, చిరంజీవి, హోంగార్డ్ రావూఫ్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డులు అందజేశారు.


