
పాత కక్షల నేపథ్యంలో కత్తితో దాడి
చీరాల: పాత కక్షల నేపథ్యంలో ఇరువర్గాలు దాడి చేసుకున్న సంఘటన శనివారం వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో చోటు చేసుకుంది. ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పందిళ్లపల్లికి చెందిన నాగేంద్రకుమార్, రామాంజనేయులు అన్నదమ్ములు. వీరికి అదే ప్రాంతానికి చెందిన కోలా వెంకటేశ్వర్లుతో పాత వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. కోలా వెంకటేశ్వర్లు కత్తితో నాగేంద్రకుమార్, రామాంజనేయులపై దాడి చేసి గాయపరిచాడు. ఇద్దరు గాయపడటంతో చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అన్నదమ్ములు తనపై దాడి చేసి గాయపరిచారని కోలా వెంకటేశ్వర్లు కూడా చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలలో చేరాడు. ఈ మేరకు ఇరువర్గాల వద్ద ఔట్‌పోస్టు పోలీసులు వివరాలను నమోదు చేశారు.