
ఆక్వా రంగ అభివృద్ధికి చర్యలు
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: జిల్లాలో ఆక్వా రంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లోని మినీ వీక్షణ సమావేశం మందిరంలో శుక్రవారం మత్స్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని వ్యవస్థీకృత పరిశ్రమగా మార్చి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆక్వా కల్చర్ కార్యకలాపాలు, ఉత్పత్తులు, సేవలను ఒకే గొడుగు కిందికు తీసుకురావడానికి జలచరాభివృద్ధి సంస్థ చట్టం– 2020ను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. చట్టం విధి విధానాలు, అమలు, లక్ష్యాలపై మత్స్యశాఖ అధికారులతో కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. ఆక్వా కల్చర్ సాగు చేసే వారంతా తప్పనిసరిగా లైసెన్సులు పొందాలని ఆయన ఆదేశించారు. గ్రామ సచివాలయంలో స్వయంగా లేదా డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఈ– మత్స్య కార్ వెబ్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆక్వా కల్చర్‌ను అభివృద్ధి చేయడానికి జిల్లా, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అసెన్డ్ భూముల్లో ఆక్వా కల్చర్ సాగు చేసే వారి వివరాలను మత్స్యశాఖ అధికారుల నుంచి ఆరా తీశారు. భూములు ఎవరికై తే ఇచ్చారో వారి కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో ఆక్వా కల్చర్ 9,579.44 హెక్టార్లలో సాగు అవుతుండగా, ఇందులో 6257.59 హెక్టార్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ అయినట్లు చెప్పారు. మిగిలిన 3321.85 హెక్టార్ల భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీ శ్రీనివాస్ నాయక్, డీడీ గాలి దేవుడు, మత్స్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
జీఎస్టీ తగ్గింపులపై
విస్తృత అవగాహన కల్పించాలి
బాపట్ల: సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్స్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సూచించారు. షాపింగ్ సందడి కార్యక్రమాల నిర్వహణపై వాణిజ్య పన్నులశాఖ అధికారులతో శనివారం స్థానిక కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. జీఎస్టీ తగ్గింపుతో ఉత్పత్తులు, వస్తువుల ధరల పట్టికను ప్రతి దుకాణంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా మందులు దుకాణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల దుకాణాలలో బోర్డులు ఉండాలని తెలిపారు. వస్తువుల ఉత్పత్తి ప్రాంతాలు, హోల్ సేల్ కేంద్రాలు, రిటైల్ దుకాణాల వద్ద కూడా బోర్డులు ఉండాలని చెప్పారు. మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా విస్తృత ప్రచారం చేయాలని ఆయన కోరారు. వాల్ పోస్టర్లు, కరపత్రాలు దుకాణాలలో కనిపించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బాపట్ల పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా షాపింగ్ సందడి కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలను చైతన్యపరిచి, ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలను వివరించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారి గ్లోరియా పాల్గొన్నారు.